78 మంది ఖైదీలు టెన్త్ పాస్‌‌‌‌..ఓపెన్ స్కూల్‌‌‌‌ ద్వారా ఖైదీలకు విద్యాభ్యాసం

78 మంది ఖైదీలు టెన్త్ పాస్‌‌‌‌..ఓపెన్ స్కూల్‌‌‌‌ ద్వారా ఖైదీలకు విద్యాభ్యాసం
  •     పాసైన వారికి సర్టిఫికెట్లు అందించిన జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో ఈ ఏడాది 78 మంది టెన్త్‌‌‌‌ పాస్‌‌‌‌ అయ్యారు. జైళ్ల శాఖ, నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాభ్యాస కార్యక్రమంలో వీరంతా చదువుకున్నారు. ఉత్తీర్ణులైన వారికి జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా బుధవారం సర్టిఫికెట్లను అందించారు. చర్లపల్లి సెంట్రల్‌‌‌‌ జైలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓపెన్‌‌‌‌ స్కూల్ ప్రతినిధులు సహా జైళ్ల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. ఖైదీల విద్య, పునరావాసం, సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించేలా వారికి విద్యాభ్యాసం కల్పిస్తున్నామని చెప్పారు. 

సులభంగా అర్థమయ్యేలా ఉపాధి, జీవనోపాధికి ఉపయోగపడేలా పాఠ్యాంశాలను ఎంపిక చేశామన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ నైపుణ్యాలకు సంబంధించిన అంశాలను కూడా చేర్చామని చెప్పారు.ఈ క్రమంలో చర్లపల్లి, నిజామాబాద్, చంచల్‌‌‌‌గూడ విమెన్ జైలులో మొత్తం 108 మంది ఖైదీలు10వ తరగతిలో చేరగా, 78 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 

ఉత్తీర్ణులైన ఖైదీలకు ఇంటర్‌‌‌‌‌‌‌‌ విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన అనంతరం చర్లపల్లి సెంట్రల్ ప్రిజన్‌‌‌‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ద్వారా అండర్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్ బీఏ కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంటుందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు ఖైదీలు తమ అనుభవాలను పంచుకున్నారు. విద్య లేకపోవడం వల్ల తమ జీవితాల్లో ఎదురైన ఇబ్బందులను వివరించారు. చదువు లేకపోవడం కారణంగా ఆత్మవిశ్వాసం తగ్గిపోయిందని, సమాజంలో తగిన గౌరవం లభించలేదని తెలిపారు. ఒక ఖైదీ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌బీ చదివి న్యాయవాదిగా పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తానని తెలిపాడు.