ఉద్యోగులకు డీఏ, డీఆర్​ను 4% పెంపు

ఉద్యోగులకు డీఏ, డీఆర్​ను 4% పెంపు
  • జులై 1 నుంచే అమల్లోకి..
  • 41.85 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి
  • ఖజానాపై రూ. 12,852.50 కోట్ల భారం
  • మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం 
  • మరో 3 నెలలపాటు పేదలకు ఉచితంగా రేషన్  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏ, డీఆర్​ను 4% పెంచింది. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిర్ణయంతో 41.85 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. తాజా నిర్ణయంతో ఖజానాపై రూ.12,852.50 కోట్ల భారం పడనుందని చెప్పారు. కొత్త డీఏతో రూ.6,591.36 కోట్లు, కొత్త డీఆర్​తో రూ.6,261.20 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 34% బేసిక్ పే/పెన్షన్ కు 4 శాతం డీఏ, డీఆర్ పెంపు అదనమని పేర్కొన్నారు. అలాగే పేదలకు మరో 3 నెలలపాటు ఫ్రీ రేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబరు 31 వరకు 80 కోట్ల మంది పేదలకు ఐదు కిలోల చొప్పున బియ్యం, గోధుమలు ఇస్తామని తెలిపారు. ‘‘అధిక ద్రవ్యోల్బణం నుంచి పేదలకు ఉపశమనం కల్పించేందుకు మరో 3 నెలలు ఫ్రీ రేషన్ ఇవ్వాలని మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ కరోనాతో ప్రపంచం పోరాడుతోంది. మన దేశం మాత్రం ఆహార భద్రత కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నది. సామాన్యుడు ఇబ్బంది పడకుండా టైమ్ కు రేషన్ అందిస్తున్నది. కరోనా వచ్చినప్పటి నుంచి సామాన్యులు కష్ట కాలం ఎదుర్కొంటున్నరు. వారి పరిస్థితిని మోడీ సర్కారు అర్థం చేసుకుని ఫ్రీ రేషన్ స్కీంను మరో మూడు నెలలపాటు పెంచాలని నిర్ణయం తీసుకుంది” అని అనురాగ్ పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి 122 లక్షల టన్నుల ధాన్యం ఉచితంగా ఇస్తామని ఆయన చెప్పారు. కేంద్రం నిర్ణయంతో ఖజానాపై అదనంగా రూ.44,762 కోట్ల భారం పడుతుందని, ఈ ఫ్రీ రేషన్ స్కీం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.3.91 లక్షల కోట్లు ఖర్చయ్యాయని ఆయన తెలిపారు. కాగా 2020 ఏప్రిల్ లో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్​ అన్నా యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద పేదలకు కేంద్రం ఉచితంగా రేషన్ అందిస్తున్నది. 

ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ల రీడెవలప్ మెంట్ కు 10 వేల కోట్లు

ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ) రైల్వే స్టేషన్ల రీడెవలప్ మెంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోదించింది. క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది.