8 లక్షల మంది పిల్లల్లో హెల్త్ ప్రాబ్లమ్స్..రక్తహీనత, వినికిడి, కంటిచూపు సమస్యలే అధికం

8 లక్షల మంది పిల్లల్లో హెల్త్ ప్రాబ్లమ్స్..రక్తహీనత, వినికిడి, కంటిచూపు సమస్యలే అధికం
  • రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేతో వెలుగులోకి
  • సుమారు 18 లక్షల మంది పిల్లల నుంచి డేటా సేకరణ
  • రక్తహీనత, వినికిడి, కంటిచూపు సమస్యలే అధికం
  • బాల భరోసాతో ఫ్రీగా వైద్యం అందించనున్న సర్కార్
  • త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా స్కీమ్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: చిన్నారుల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి. 
రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది పిల్లలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. ఎక్కువ మంది చిన్నారుల్లో కంటి చూపు మందగించడం, రక్తహీనత, వినికిడి లోపాన్ని గుర్తించారు. బాల భరోసా స్కీమ్ కింద వీరికి ట్రీట్​మెంట్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించనున్నారు. చిన్నతనంలోనే అనారోగ్య సమస్యలు గుర్తించి చికిత్స అందించడమే బాల భరోసా స్కీమ్ లక్ష్యం. 


ఈ పథకంలో భాగంగా అంగన్​వాడీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 0 నుంచి 5 ఏండ్లలోపు పిల్లలపై సర్వే నిర్వహించారు. దాదాపు 18 లక్షల మంది చిన్నారులను పరీక్షించారు. వీరిలో 8 లక్షల మంది చిన్నారుల ఆరోగ్యం బాగాలేదని తేలింది. నరాల బలహీనత, ఆటిజం, నడకలో ఇబ్బందులు, రక్తహీనత, పోషకాహార లోపంతో చిన్నారులు బాధపడుతున్నట్లు గుర్తించారు. ఎర్లీ స్టేజ్​లోనే ఇబ్బందులను గుర్తించి ట్రీట్​మెంట్ అందించకపోతే భవిష్యత్తులో పర్మినెంట్ డిసెబిలిటీస్​గా మారే ప్రమాదం ఉన్నది. 

ఐదేండ్లలోపు చేయించాలి..

మనిషి మెదడులో 90 శాతం ఎదుగుదల అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఐదేండ్లలోపే జరుగుతుంది. ఈ టైమ్‌‌లో పిల్లల్లో ఎదుగుదల, పుట్టుకతోవచ్చే లోపాలు, జ్ఞానేంద్రియాల సమస్యలు, న్యూరో డెవలప్మెంట్ ఇబ్బందులు, హైపర్ యాక్టివిటీ, పోషకాహార సమస్యలను గుర్తించి చికిత్స అందించాలి. లేకపోతే అవి పర్మినెంట్ డిసెబిలిటీగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి చిన్నపాటి థెరపీలు, సర్జరీలతో సెట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాగా, ఈ వివరాలు ప్రస్తుతం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రైమరీ సర్వేలో తేలాయి. ఈ వివరాలను హెల్త్ డిపార్ట్మెంట్ కు చెందిన రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్​బీఎస్​కే)కు అధికారులు అందించనున్నారు. ఆర్​బీఎస్​కే ఏ చిన్నారులకు థెరపీలు, సర్జరీలు, ఇతర చికిత్సలు అవసరమో... నమోదు చేసి మెడికల్ టెస్టులు నిర్వహించి ఏయే ట్రీట్మెంట్ ఎంత మంది పిల్లలకు అవసరమో... ఫైనల్ డేటాను సిద్ధం చేయనున్నది. ఆర్​బీఎస్​కే డేటా ఆధారంగా చిన్నారులకు అవసరమైన చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా అందించనున్నది.

సర్జరీలు, థెరపీలు అన్నీ ఫ్రీ..

సర్వేలో సమస్యలున్నట్లు తేలిన పిల్లలకు దశలవారీగా వైద్యం అందించనున్నారు. మొదట పీహెచ్‌‌సీల్లో, అక్కడ నయం కాకపోతే జిల్లా హాస్పిటల్స్ లో ఎర్లీ ఇంటర్వెన్షన్ క్యాంప్​కు తరలిస్తారు. కంటి ఆపరేషన్లు, కాక్లియర్ ఇంప్లాట్స్, గుండె జబ్బులు, ఇతర పెద్ద ఆపరేషన్లు అవసరమైతే హైదరాబాద్‌‌లోని కార్పొరేట్, ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్​లో ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, సీఎస్ఆర్ సహకారంతో ఫ్రీగా చేయిస్తారు. అలాగే, మాటలు రాని వారికి స్పీచ్ థెరపీ, నడవలేని వారికి ఫిజియోథెరపీ వంటి సేవలను డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ల (డీఈఐసీ) ద్వారా అందించనున్నారు. ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని ట్రాక్ చేసేందుకు స్పెషల్ గా మొబైల్ యాప్‌‌ కూడా రూపొందించారు. అలాగే, చికిత్స కోసం పిల్లలను హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు అయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అంతేగాకుండా, పిల్లల కోసం కూలి పనులు మానేసి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పేరెంట్స్​కు ఆ రోజుకు సంబంధించిన వేతన నష్టపరిహారాన్ని కూడా చెల్లించనున్నది. బాల భరోసా స్కీమ్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో నిర్వహించనున్నాయి.

ప్రత్యేక టూల్​తో డేటా సేకరణ

బాల భరోసా స్కీమ్​లో భాగంగా స్పెషల్​గా ‘స్మార్ట్ చెక్- 42’అనే అడ్వాన్స్డ్ టూల్​ను ప్రభుత్వం తీసుకొచ్చింది. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్ (ఎన్ఐఈపీఐడీ) రూపొందించిన ఈ టూల్​తో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఇల్లిల్లూ తిరుగుతూ పిల్లల అనారోగ్య సమస్యలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల నడక, మాట, చూపు, వినికిడి, తెలివితేటలు, ప్రవర్తన వంటి అంశాలపై 42 రకాల ప్రశ్నలతో సర్వే చేశారు. ఈ 42 అంశాల్లో ఏ ఒక్క లోపం కనిపించినా వారిని వెంటనే రిస్క్ లిస్టులో చేర్చారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమ్‌ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.