ఆస్ట్రేలియాలో ఘోరం.. భారత సంతతికి చెందిన.. 8 నెలల నిండు గర్భిణి ఆశలను చిదిమేసిన టీనేజర్ !

ఆస్ట్రేలియాలో ఘోరం.. భారత సంతతికి చెందిన.. 8 నెలల నిండు గర్భిణి ఆశలను చిదిమేసిన టీనేజర్ !

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందిన ఎనిమిది నెలల నిండు గర్భిణిని ఆమె రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా ఓవర్ స్పీడ్గా వచ్చిన BMW కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆమె చనిపోయింది. సిడ్నీ శివారు ప్రాంతమైన హార్న్స్‌బైలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన ఆ మహిళ పేరు సమన్విత ధరేశ్వర్. వయసు 33 ఏళ్లు. సమన్విత, ఆమె భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి హార్న్స్‌బైలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. కొన్ని వారాల్లోనే ఆమె మరో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండగా ఇంతలో ఈ ఘోరం జరగడంతో ఆమె కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బీఎండబ్ల్యూ కారు నడిపిన వ్యక్తిని ఆరోన్ పపజోగ్లుగా పోలీసులు గుర్తించారు. 19 ఏళ్ల ఈ టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓవర్ స్పీడ్తో కారు డ్రైవ్ చేయడంతోనే ఈ దారుణం జరిగింది. అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని బెయిల్ రిజెక్ట్ అయింది. సిడ్నీ శివారు ప్రాంతమైన హార్న్స్‌బైలో సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడటం కోసం సమన్విత భర్త ల్యాండ్ కూడా కొన్నాడు. కొన్ని నెలల్లోనే వారి సొంతింటి కల నెరవేర్చుకుని కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చని సమన్విత ఎంతో ఆశపడింది. ఇంతలోనే ఇలా జరిగింది.

ఈ ప్రమాదంలో మరో విషాదం ఏంటంటే.. సమన్విత కడుపులోని బిడ్డ కూడా చనిపోయిందని వెస్ట్ మెడ్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. నిందితుడిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొనుక్కున్న స్థలంలో రెండు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకునేందుకు ఈ కుటుంబం సెప్టెంబర్ 8న బ్లాక్ టౌన్ సిటీ కౌన్సిల్లో బిల్డింగ్ డెవలప్మెంట్ అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు.

సెప్టెంబర్ 16న ఈ అప్లికేషన్ అప్రూవ్ అయింది. దీంతో.. 4 లక్షల 94 వేల 886 డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసుకున్న ఈ కుటుంబం.. మరికొన్ని రోజుల్లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాలని భావిస్తున్న సమయంలో సమన్విత అకాల మరణం ఈ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఈ ప్రమాదానికి కారణమైన టీనేజర్ మద్యం తాగి కారు నడపలేదు. డ్రగ్స్ తీసుకోలేదు. రెడ్ సిగ్నల్ను క్రాస్ చేయలేదు. కానీ.. అతి వేగంతో కారు నడపడం వల్ల ఇంత ఘోరం జరిగింది.