రోజుకు 80 మర్డర్లు, 77 రేప్‌లు: ఎన్‌సీఆర్‌‌బీ రిపోర్ట్

రోజుకు 80 మర్డర్లు, 77 రేప్‌లు: ఎన్‌సీఆర్‌‌బీ రిపోర్ట్

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఏడాదీ క్రైం రేటు పెరుగుతోంది. గడిచిన ఏడాదిలో సగటున రోజుకు 80 మర్డర్లు, 77 రేప్‌ ఘటనలు పోలీస్‌ స్టేషన్లలో రిపోర్ట్ అవుతున్నాయి. 2020 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్‌ వివరాలతో నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌‌బీ) నివేదికను బుధవారం విడుదల చేసింది. 2019లో మొత్తం 28,915 మర్డర్లు జరిగితే.. 2020లో ఒక్క శాతం పెరిగి 29,193 మర్డర్లు రిపోర్ట్ అయ్యాయని పేర్కొంది. అయితే ఆడవాళ్లపై జరుగుతున్న నేరాల్లో మాత్రం ముందటేడు కంటే 2020లో కొంత తగ్గుదల ఉంది. అయితే కరోనా, లాక్‌డౌన్ సుదీర్ఘ కాలం నడిచినా కూడా నేరాలు ఆగలేదు. 2019లో మహిళలపై జరిగిన దాడులు, హింస, వేధింపులు, అకృత్యాలకు సంబంధించిన నేరాల సంఖ్య 4,05,326 కాగా.. 2020లో 8.3 శాతం తగ్గి.. 3,71,503 కేసులు నమోదయ్యాయి. ఇందులో రేప్‌ కేసులే 28,046 ఉన్నాయి. అంటే రోజుకు సగటున 77 రేప్‌ ఘటనలు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌‌బీ పేర్కొంది. 

టాప్‌ – 4 రాష్ట్రాలివే..

మర్డర్‌‌ కేసులు

యూపీ        3,779

బీహార్‌‌        3,150

మహారాష్ట్ర        2,163

మధ్యప్రదేశ్        2,101

రేప్‌ కేసులు..

రాజస్థాన్‌              5,310

యూపీ                 2,769

మధ్యప్రదేశ్‌        2,339

మహారాష్ట్ర          2,061

అత్తింటి వేధింపులే ఎక్కవ

మహిళలపై జరిగిన నేరాలు 2019తో పోలిస్తే 2020లో కొంత మేర తగ్గాయి. ముందటేడాది దేశంలో లక్ష మంది మహిళల్లో 62.3 మందిపై నేరాలు జరగగా, 2020లో ఆ సంఖ్య 56.5కు తగ్గింది. 2019లో మహిళలపై మొత్తంగా జరిగిన నేరాలు 4,05,326 కాగా.. 2020లో 3,71,503 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా అత్తింటి వాళ్ల వేధింపులకు సంబంధించినవే ఉన్నాయి. భర్త, బంధువుల వేధింపులకు సంబంధించిన కేసులు 1,11,549 నమోదయ్యాయి. ఇక మహిళల కిడ్నాప్ కేసులు 84,8058 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పిల్లలే (56,591) బాధితులుగా ఉన్నారు. రేప్‌లు కాక, లైంగిక వేధింపుల కేసులు 85,392 నమోదయ్యాయి. అలాగే అత్యాచార యత్నం కేసులు 3,741 రిపోర్ట్ అయ్యాయని ఎన్‌సీఆర్‌‌బీ పేర్కొంది. యాసిడ్ దాడి కేసులు 105 నమోదయ్యాయి. వరకట్న వేధింపుల మరణాలు 6,966 నమోదు కాగా, ఈ వేధింపుల బాధితుల సంఖ్య 7,045 ఉన్నట్లు ఎన్‌సీఆర్‌‌బీ వెల్లడించింది. 

ప్రతి లక్షలో 28 మంది పిల్లలపై నేరాలు

గత ఏడాదిలో దేశంలో పిల్లలపై 1,28,531 నేరాలు జరిగాయి. అయితే 2019తో (1,48,090) పోలిస్తే 13.2 శాతం ఈ నేరాలు తగ్గాయి. 2019లో ప్రతి లక్ష మంది పిల్లల్లో 33.2 మందిపై నేరాలు జరగ్గా.. 2020లో ఈ సంఖ్య 28.9కి తగ్గిందని ఎన్‌సీఆర్‌‌బీ తెలిపింది. గత ఏడాది 4,709 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు కాగా, అందులో బాధితులు 2,222 మంది పిల్లలు ఉన్నారని పేర్కొంది.