చెన్నూరు, వెలుగు: మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని, చెడు అలవాట్లకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ నిర్మూలనపై చెన్నూరు మండలంలోని కిష్టంపేట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులతోపాటు కిష్టంపేట, ఎల్లక్కపేట, లింగంపల్లి గ్రామ యువకులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని అప్పుడే తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కుతుందన్నారు.
గంజాయి, పేకాట, డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల బారినపడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. గంజాయి తాగేవారు, రవాణా చేసేవారి పేర్లు తమ వద్ద ఉన్నాయని, వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. మత్తు పర్థాలతో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయికి బానిసైనవారిని గుర్తించి మంచిర్యాల డీ-అడిక్షన్ సెంటర్ కు తరలించి ట్రీట్మెంట్ చేయిస్తామని తెలిపారు. పట్టణ సీఐ బన్సీలాల్ ఎస్సైలు, సుబ్బారావు, శ్యాం పటేల్, కాలేజీ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.
