న్యూఢిల్లీ: ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో భారీగా నగదు పట్టుబడిందన్న ఆరోపణలతో గత ఏడాది కాలంగా వివాదాల్లో చిక్కుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ వేగవంతం కావడంతో ముందే తప్పుకున్నారు. శుక్రవారం తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో అప్పట్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది.
మంటలను ఆర్పే క్రమంలో లోపలికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి, అక్కడ సుమారు 1.5 అడుగుల ఎత్తున పేర్చి ఉన్న కరెన్సీ నోట్ల కట్టలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా అంతర్గత విచారణకు ఆదేశించారు. అనంతరం జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ, ఆయనకు ఎలాంటి జ్యుడీషియల్ పనులను కేటాయించవద్దని ఆదేశాలు జారీ చేశారు.
అభిశంసన ప్రక్రియ.. విచారణ
జస్టిస్ వర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 146 మంది లోక్‌సభ సభ్యులు అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించారు. 2025 ఆగస్టులో ఈ ఆరోపణలపై స్పీకర్ ఓం బిర్లా విచారణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ ఏర్పాటును సవాలు చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అంతకుముందు జరిగిన అంతర్గత విచారణలో, నగదు దొరికిన గదిపై జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే నియంత్రణ ఉందని కమిటీ తేల్చింది. తనపై వచ్చిన ఆరోపణలను జస్టిస్ వర్మ తీవ్రంగా ఖండించారు.
