బృందావన్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మథుర బృందావన్‌లోని కేసీ ఘాట్ సమీపంలో పడవ బోల్తాపడి ఆరుగురు మృతిచెందారు. మరికొంతమంది గల్లంతయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం యమునా నదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 25 మందికి పైగా పర్యాటకులతో వెళ్తున్న పడవ.. నది మధ్యలో ఉండగా ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో పడవ అదుపు తప్పి పాంటూన్ వంతెనను బలంగా ఢీకొట్టింది.
దీంతో పడవ బోల్తా పడగా.. ప్రయాణికులందరూ నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 17 మందిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. రెస్క్యూ బృందాలతో పాటు 50 మంది స్థానిక గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
