
- 80 % మందికి ఏదో ఒక సమస్య
- 92% మందితో కోల్కతా టాప్
- 80 శాతంతో మూడో స్థానంలో హైదరాబాద్
- దక్షిణాది రాష్ట్రాల్లోపంటి సమస్యలు తక్కువ
చంటి పిల్లలు అలా ఒక్క నవ్వు నవ్వితే చాలు మనకు ఎన్ని సమస్యలున్నా అందులో కొట్టుకుపోతాయి. ఆ చంటి పిల్లల నవ్వుకు అప్పుడప్పుడే వస్తున్న పాల పండ్లు తోడైతే దానికి ఇంకా అందం వస్తుంది. కానీ, మనం ఎంత వరకు ఆ పసి బుగ్గల్లోని పాల పండ్లను కాచుకుంటున్నాం? చిన్నప్పటి నుంచే వాళ్ల పంటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం? చాలా తక్కువంటోంది ఓ సర్వే. అంతేకాదు, 80 శాతం మంది పిల్లలను పంటి సమస్యలు వేధిస్తున్నాయంటోంది. కంతార్ ఐఎంఆర్బీ అనే సంస్థతో కాల్గేట్ పామోలివ్ ఇండియా దేశవ్యాప్తంగా చేయించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పాచి పళ్లు, కేవిటీ (పంటి పుచ్చులు), చిగురు సమస్యలు, చెడు వాసన, రక్తం కారడం వంటి అనేక సమస్యలు పిల్లలను పట్టి పీడిస్తున్నాయని సర్వేలో తేలింది. ప్రతి పది మందిలో 8 మందికి పంటి సమస్యలున్నాయని తేలింది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి కేవిటీ సమస్యలున్నాయి. పిల్లలే కాదు, పెద్దల్లోనూ ఆ సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. పదిలో తొమ్మిది మందికి పంటి సమస్యలున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాదిలో పంటి సమస్యల ప్రభావం చాలా తక్కువ అని సర్వేలో తేలింది.
బాగానే ఉందనుకుంటున్నారు
పిల్లలకు చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులు తట్టుకోలేరు. కానీ, అన్ని రకాల ఆరోగ్య సమస్యలను పట్టించుకుంటున్న పేరెంట్స్, పిల్లల పంటి సమస్యలను మాత్రం పట్టించుకోవట్లేదు. అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు. పదిలో 8 మంది అనుకుంటున్నది అదే. కానీ, 80 శాతం మంది పిల్లలు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారని సర్వేలో తేలింది. ఎక్కువగా కోల్కతాలో 92 శాతం మంది పిల్లలకు పంటి సమస్యలున్నాయి. ఆ తర్వాత ముంబై 88%, హైదరాబాద్లో 80 శాతం మందిని పంటి సమస్యలు పీడిస్తున్నాయి. ఇక, చాలా వరకు పిల్లల పంటి రక్షణకు అవసరమైన కనీస చర్యలు తీసుకోవట్లేదని సర్వేలో వెల్లడైంది. 70 శాతం మంది పిల్లలు రెండు సార్లు బ్రష్ చేయట్లేదు. 60 శాతం మంది పిల్లలను ఏడాదిలో ఒక్కసారైనా డెంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లలేదు. చాలా మంది పిల్లల పంటి సమస్యలకు ప్రధాన కారణం చక్కెరతో చేసిన తిండి పదార్థాలే. అవును, అవి తింటున్న వాళ్లలోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని సర్వేలో తేలింది. పదిలో 8 మందికి దాని వల్లే సమస్యలని సర్వే చెప్పింది. 44 శాతం మంది పిల్లలకు పంటి చికిత్సలు చాలా అవసరమని సర్వే సూచించింది. చాలా మందికి కొత్త పళ్లు పెట్టించాలని, కొందరికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించాలని పేర్కొంది.
పాల పండ్లు వచ్చినప్పటి నుంచే…
పిల్లలకు పాల పండ్లు వచ్చినప్పటి నుంచే పంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డెంటిస్టులు సూచిస్తున్నారు. ఆ పాల పండ్లే పిల్లల ఎదుగుదలను డిసైడ్ చేస్తాయని అంటున్నారు. ‘‘ప్రస్తుతం పిల్లలు ఎదుర్కొంటున్న కేవిటీలు, నోటి సమస్యలకు కారణం, పాలపండ్లు వచ్చినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోవడమే” అని ఇండియన్ సొసైటీ ఆఫ్ పీడోడాంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ (ఐఎస్పీపీడీ) సభ్యురాలు డాక్టర్ మీనాక్షి ఎస్.ఖేర్ అన్నారు.