- వారిలో 83 మంది స్పెషల్ నీడ్స్ పిల్లలే
- ప్రత్యేక అవసరాలున్న పిల్లల దత్తతకు ముందుకురాని జంటలు
- నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న పసి మొగ్గలు
హైదరాబాద్, వెలుగు: ఓ పాపకు మాటలు రావు.. సైగలతోనే తన ఆకలిని చెబుతుంది. మరో బాబుకు అడుగులు తడబడతాయి.. గోడను పట్టుకుని నడిచేందుకు ప్రయత్నిస్తాడు. ఇంకో చిన్నారి కళ్లు ప్రపంచాన్ని చూడలేవు... కానీ అమ్మ స్పర్శ కోసం ఆ పసిహృదయం తపిస్తుంది. ఈ పిల్లలందరికీ శాపం ఒక్క వైకల్యం మాత్రమే కాదు.. అల్లారుముద్దుగా పెంచుకునే తల్లిదండ్రులు లేకపోవడం కూడా! రాష్ట్రంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడిచే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (ఎస్ఏఏ)ల్లో ఉన్న 154 మంది అనాథ చిన్నారుల్లో ఏకంగా 83 మంది ఇలాంటి ప్రత్యేక అవసరాలు ఉన్నవారే కావడం గమనార్హం. వారిని దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ పసిమొగ్గల జీవితాలు ఏండ్లుగా శిశు గృహాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఈ పిల్లలకు వైకల్యం అదనపు శాపంగా మారింది.
83 మంది ఎదురుచూపు...
రాష్ట్రంలో ఎస్ఏఏలలో మొత్తం 310 మంది చిన్నారులు ఉండగా, అందులో దత్తతకు 154 మంది సిద్ధంగా ఉన్నారు. వీరిలో జనరల్ కేటగిరీ పిల్లలు 71 మంది ఉంటే.. ప్రత్యేక అవసరాల పిల్లలే 83 మంది వరకు ఉన్నారు. అంటే సగానికి పైగా స్పెషల్ నీడ్స్ పిల్లలే ఉండడం గమనార్హం. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో దత్తతకు సిద్ధంగా ఉన్న 93 మందిలో 62 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆదిలాబాద్‌లో అందుబాటులో ఉన్న ముగ్గురు పిల్లలూ ప్రత్యేక అవసరాలు ఉన్నవారే. ఇక మహబూబ్‌నగర్‌లో 8 మంది, నిజామాబాద్‌లో 4 మంది స్పెషల్ నీడ్స్ పిల్లలు దత్తతకు సిద్ధంగా ఉన్నారు.
ఆరోగ్యంగా ఉన్న పిల్లల వైపే మొగ్గు...
ఆరోగ్యంగా, చలాకీగా ఉన్న పిల్లలైతే చాలని దత్తత కోసం వచ్చేవాళ్లు కోరుకుంటున్నారు తప్ప.. ఓపికతో, ప్రేమతో ఈ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచన చాలామందికి రావడం లేదని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు చెబుతున్నారు. స్పెషల్ నీడ్స్ పిల్లలను ఎక్కువగా ఇతర దేశస్తులు, ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుంటారని.. మన దేశంలో మాత్రం అందుకు జంటలు ముందుకు రావడం లేదంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జనరల్, స్పెషల్ కేటగిరీలో మన దేశం వెలుపలా 26 మంది అమ్మాయిలు, 26 మంది అబ్బాయిలు కలిపి మొత్తం 52 మందిని దత్తత తీసుకున్నారు. ఇతర దేశాల వాళ్లు ముగ్గురు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలను అడాప్షన్ చేసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 60 మందిని దత్తత తీసుకున్నారు.
మనం మారనంత వరకు...
ఈ చిన్నారులు అనాథలుగా మిగిలిపోవడానికి కేవలం వారి శారీరక, మానసిక స్థితి మాత్రమే కాదు.. సమాజ దృక్పథం కూడా ఓ ప్రధాన కారణం. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను పెంచడం ఓ భారంగా, శాపంగా భావించే మనస్తత్వం మారనంత కాలం ఆ పసిమొగ్గల తలరాతలు మారవు. వారి చికిత్సకు అయ్యే ఖర్చు, స్పెషల్ స్కూళ్లు, నిరంతర పర్యవేక్షణ వంటి సవాళ్లకు భయపడి సమాజం వారిని దూరం పెడుతున్నది. కానీ.. వారి నిష్కల్మషమైన నవ్వులు, ప్రేమను అర్థం చేసుకుంటే.. ఏ సంపదా వాటికి సాటిరాదనే విషయాన్ని మరుస్తున్నారు.
ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి..
ప్రభుత్వం కూడా వారిని ఏజెన్సీల్లో ఉంచి చేతులు దులుపుకోకుండా.. ఇటువంటి చిన్నారులను దత్తత తీసుకునే వారికి ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయం అందించాలి. ఆ పిల్లలకు దత్తత తరువాత వైద్య భరోసా కల్పించాలి. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, చైతన్యం తీసుకురావాలి. ఇందుకోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. లేకపోతే.. అమ్మా అని పిలవాలని ఆశగా ఎదురుచూస్తున్న ఆ పసికూనల ఆశలు ఆ శిశు గృహాల నాలుగు గోడల మధ్యే నలిగిపోతాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
ఆ కళ్లు వెతికేది అమ్మ ప్రేమనే...
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు... ఆ శిశు గృహాల్లోని చిన్నారుల కళ్లు ఒకే వెతుకులాటలో ఉంటాయి. తమను ప్రేమగా దగ్గరకు తీసుకునే అమ్మ కోసం, చేయి పట్టుకుని నడిపించే నాన్న కోసం అవి ఎదురుచూస్తుంటాయి. అక్కడ పనిచేసే ఆయాలు, సిబ్బంది, కేర్ టేకర్స్ ఎంత ప్రేమగా చూసుకున్నా... తల్లిదండ్రుల ప్రేమకు అది సాటిరాదు. సాధారణ పిల్లలతో పోలిస్తే... ఈ స్పెషల్ నీడ్స్ చిన్నారులకు మరింత శ్రద్ధ, ఆప్యాయత అవసరం. కానీ సమాజంలో నెలకొన్న అపోహలు, వారిని పెంచడానికి పడే శ్రమకు భయపడి చాలామంది జంటలు ఈ చిన్నారుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ‘లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్’ అని బోర్డులు పెట్టినా... వారిని చేరదీసే హృదయాలు కరువయ్యాయి.
