9 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం

9 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్, వెలుగు: ఉత్తర తెలంగాణలోని 9 జిల్లాల్లో సోమవారం అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది.

నిజామాబాద్, సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని పేర్కొంది. ఎల్లో అలర్ట్ లో ఉన్న నల్గొండ, సూర్యాపేట, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.