100 పర్యాటక కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్

100 పర్యాటక కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్
  • 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ 
  • టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి

హైదరాబాద్​, వెలుగు:రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, జలపాతాలు, ఆలయాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాల వంటి100 పర్యాటక కేంద్రాల్లో  క్లీన్​ అండ్​ గ్రీన్ కార్యక్రమం నిర్వహిస్తామని టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి అన్నారు. పర్యాటకులకు అవసరమైన కనీస వసతుల కల్పనే లక్ష్యంగా టూరిజం శాఖ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసినట్లు తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో  మాట్లాడారు. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వల్లూరు క్రాంతి వెల్లడించారు. టూరిస్ట్ ప్రదేశాల్లో పచ్చదనం పెంపొందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.  ముఖ్యంగా మహిళా పర్యాటకుల కోసం అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు.  ప్రభుత్వ నిధులతోపాటు సీఎస్ఆర్ నిధులు, ఎన్జీవోల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

మొత్తం 100 కేంద్రాల్లో  చెత్తాచెదారం లేకుండా చూడటంతోపాటు ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచనున్నట్లు తెలిపారు. ఈ 99 రోజుల ప్రణాళిక విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని క్రాంతి ఆశాభావం వ్యక్తం చేశారు.