- సకాలంలో స్కూల్‌కు వెళ్లలేకపోతున్నామని ఆవేదన
అంబర్ పేట, వెలుగు: మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి అంబర్ పేటలోని ప్రేమ్ నగర్ కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి మహ్మద్ షారిక్ అలీ రెండు పేజీల లేఖ రాశారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఆలస్యం జరుగుతుండడంతో అంబర్‌పేట, -మలక్‌పేట, -దిల్సుఖ్నగర్ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్కూల్ సమయంలో భారీ ట్రాఫిక్ కారణంగా సకాలంలో తరగతులకు హాజరు కాలేకపోతున్నామని, ఇది చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, కనీసం ఒక వైపు అయినా వాహనదారుల అందుబాటులోకి తీసుకొచ్చేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సీఎం సార్ అనుమతిస్తే అంబర్‌పేట ప్రాంత సమస్యలను నేరుగా కలిసి వివరిస్తానని విద్యార్థి తన లేఖలో పేర్కొన్నారు.
