
- కత్తులతో పొడిచి, గొంతు కోసి.. కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య
- ప్రెషర్ కుక్కర్తో పాశవికంగా తలపై కొట్టి చంపిన వైనం
- ఇంట్లో పనిచేసే యువకుడే సూత్రధారి
- అక్కడే స్నానం చేసి స్కూటీపై పరారైన దుండగులు
- దోపిడీకి అడ్డువచ్చిందనే దారుణం!
కూకట్‌పల్లి, వెలుగు: కూకట్ పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి, కత్తులతో పొడిచి, ప్రెషర్ కుక్కర్తో కొట్టి అత్యంత పాశవికంగా దుండగులు హత్యకు పాల్పడ్డారు. పది రోజుల కింద ఇంట్లో పనికి చేరిన యువకుడు మరో వ్యక్తి సహకారంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం దుండగులు అక్కడే స్నానం చేసి, పెద్ద మొత్తంలో నగలు, నగదుతో పరారైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రేణు (50), రాకేశ్ అగర్వాల్ దంపతులు. వీరికి 26 ఏండ్ల కొడుకు ఉండగా, అందరూ కలిసి కూకట్‌పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో13వ ఫ్లోర్లో నివాసం ఉంటున్నారు.
రాకేశ్బాలానగర్లో స్టీల్ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాడు. రోజూ కొడుకుతో పాటు ఆఫీసుకు వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంటాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం తన కొడుకుతో కలిసి ఆఫీస్‌కు వెళ్లాడు. రాత్రి 7.30 సమయంలో ఇంటికి వచ్చారు. తాళం వేసి ఉండడంతో ఫ్లంబర్ సాయంతో బాల్కనీ నుంచి తలుపు తీసి లోపలకు వెళ్లారు. అప్పటికే రేణు రక్తపు మడుగులో పడి, కాళ్లు, చేతులు కట్టేసి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. మృతురాలి ఒంటిపై, గొంతుపై కత్తులు, సిజర్స్‌తో పొడిచిన ఆనవాళ్లు గుర్తించారు.
కాగా, పది రోజుల కింద జార్ఖండ్ నుంచి వచ్చిన హర్ష(20) అనే యువకుడిని రేణు దంపతులు ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఇదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్న రోషన్ అనే వ్యక్తి చెప్పడంతోనే.. హర్షను పనిలోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలిసే దోపిడీకి ప్లాన్ చేసి ఉంటారని, రేణు అగర్వాల్అడ్డుకోవడంతోనే ఆమెను హత్య చేసి, దోపిడీ చేసి పరారై ఉంటారని ప్రాథమిక ఆధారాలతో పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులుగా భావిస్తున్న ఇద్దరు యువకులు లిఫ్ట్‌లో బయటకు ఒక బ్యాగ్‌తో కలిసి వెళుతుండడం సీసీ కెమెరాలో రికార్డయింది.
అలాగే అపార్ట్మెంట్ నుంచి రేణు స్కూటీపై బయటకు వెళ్లడం కూడా కన్పించింది. వీరిద్దరే హత్యకు పాల్పడి ఉంటారని దాదాపు నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే, ఎంత మొత్తం దోపిడీ జరిగిందనేది నిర్ధారణ కాలేదని పోలీసులు చెబుతున్నారు.