- పీసీబీ, మైన్స్ అధికారులపై గ్రామస్తుల ప్రశ్నల వర్షం
- జనాల్లో కాకుండా, అడవిలో అభిప్రాయాలు సేకరించడమేంటని నిలదీత
- క్వారీతో కురుమూర్తి క్షేత్రం దెబ్బతింటుందని ఆందోళన
- అనుమతులు ఇస్తే ఆందోళనలకు దిగుతామని హెచ్చరిక
మమబూబ్నగర్/చిన్నచింతకుంట, వెలుగు: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తి క్షేత్రం వద్ద క్రషర్ క్వారీకి అనుమతులు వద్దే వద్దని ప్రజలు, రైతులు తేల్పి చెప్పారు. తిరుపతి తరహాలోనే ఇక్కడ ఏడు కొండలు ఉన్నాయని, క్వారీకి అనుమతులిస్తే బ్లాస్టింగులు, తవ్వకాలతో వెయ్యేండ్ల చరిత్ర గల ఈ క్షేత్రం దెబ్బతింటుందని అన్నారు. 2023లో ఎవరికీ తెలియకుండా అనుమతులిచ్చి.. అడ్డుకోవడంతో విరమించుకున్నారని, మళ్లీ ఇప్పుడు క్వారీకి అనుమతుల కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.
క్వారీకి అనుమతులు ఇస్తే ఉద్యమాలకు దిగుతామని, ప్రాణ త్యాగాలకూ వెనుకాడబోమని హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ శివారులో వెలిసిన కురుమూర్తి గుట్టల్లో క్రషర్ క్వారీ తవ్వకాల కోసం మంగళవారం ఉదయం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కార్యక్రమానికి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ హరిప్రియ, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ సురేశ్, తహసీల్దార్ ఎల్లయ్య హాజరయ్యారు.
ఆఫీసర్లపై ప్రశ్నల వర్షం..
ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీకి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న అమ్మాపూర్, గూడూరు, ఎంకంపల్లి, చిన్నచింతకుంట, మద్దూరు, కురుమూర్తి, దుప్పల్లి, కొన్నూరు, అల్లీపూర్ గ్రామస్తులకు ఎందుకు సమచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం తమ గ్రామానికే సమాచారం ఎందుకు ఇచ్చారని, ఒక రోజు ముందు దండోరా వేయించి హడావుడిగా అభిప్రాయ సేకరణ చేపట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ లేదా గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సిన సమావేశాన్ని క్వారీకి దగ్గర్లో నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ప్రజలు, రైతులు లేకుండా ఎవరి అభిప్రాయాలు తీసుకోవడానికి ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు.
అనుకూలంగా ఉన్న వారికే స్లిప్పులు..
ప్రజాభిప్రాయ సేకరణలో ఆఫీసర్లు పేర్లు రాసి పంపిన రైతులకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు. కొందరు పొలిటికల్ లీడర్లు వారి అనుచరులతో మాట్లాడించారని రైతులు ఆరోపిస్తున్నారు. క్వారీ చుట్టు ప్రాంతాలకు సంబంధం లేని వ్యక్తులతో అభిప్రాయం ఎలా తీసుకుంటారని, వారికి ఇక్కడ భూములు కూడా లేవని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడానికి స్లిప్పులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. క్వారీ పరిధిలో ఉన్న తమకు స్లిప్పులు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడున్న సిబ్బంది వారికి స్లిప్పులు ఇవ్వడంతో మాట్లాడారు.
రాజగోపురం, గర్భగుడి దద్దరిల్లిపోయింది
2023లో కురుమూర్తి గుట్టల్లో క్రషర్ కోసం బ్లాసింగ్ చేశారు. ఆ ధాటికి క్షేత్రం రాజగోపురం, గర్భగుడి అదిరిపోయాయి. పూజారులు భయపడి ఎండోమెంట్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేశారు. అక్కడ క్వారీని ఆపాలని ఉద్యమం చేశాం. మళ్లీ క్వారీకి అనుమతులు ఇవ్వడానికి ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు. అడవిలో ప్రజాభిప్రాయ సేకరణ ఏంటి?.– బలరాం యాదవ్, అమ్మాపూర్
ఉద్యమం చేస్తాం
క్వారీ ప్రయత్నాలను ఆపకపోతే హిందూ సంస్థలతో కలిసి పోరాటాలు చేస్తాం. గతంలో ఇక్కడ క్వారీ వద్దనే జిల్లా ఆఫీసర్లందరికీ చెప్పినం. మళ్లీ అభిప్రాయం అంటూ క్వారీకి పర్మిషన్లు ఇచ్చే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు?.– నంబి శ్రీకృష్ణ, అమ్మాపూర్
రిపోర్టు కేంద్రానికి పంపిస్తాం
మేం అభిప్రాయం మాత్రమే తీసుకుంటున్నాం. ప్రజలు, రైతులు చెప్పిన వివరాలను నోట్ చేసుకున్నాం. నోట్ చేసుకున్న వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. హరిప్రియ, అడిషనల్ కలెక్టర్, మహబూబ్నగర్
