పెట్రోల్ వెహికల్స్‌లో ఫ్యుయెల్ అయిపోతే క్షణాల్లో కొట్టించుకుని వెళ్లిపోవచ్చు. కానీ.. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో చార్జింగ్ అయిపోతే రీచార్జ్ చేయడానికి గంటల కొద్దీ టైం పడుతుంది. అందుకే ఈవీల వల్ల పొల్యూషన్, ఖర్చు తగ్గుతున్నాయని తెలిసినా కొందరు వాటికి దూరంగా ఉంటున్నారు. అలాంటివాళ్లను కూడా ఈవీలకు దగ్గర చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ‘బ్యాటరీ స్మార్ట్’ స్టార్టప్. వీళ్ల దగ్గర ఫుల్ చార్జ్ చేసిన బ్యాటరీలు రెడీగా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాటరీ స్టేషన్‌కు వెళ్లి క్షణాల్లో స్వాప్ చేసుకోవచ్చు.
పుల్కిత్ ఖురాన, సిద్ధార్థ్ సిక్కా 2008లో ఐఐటీ కాన్‌పూర్‌లోని హాస్టల్‌లో మొదటిసారి కలిశారు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండడంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ల మధ్య రెగ్యులర్‌గా ఇండియన్ ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలోని సవాళ్లపై చర్చలు జరిగేవి. ఎప్పుడూ వాటి పరిష్కార మార్గాల గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్లు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇద్దరూ లాజిస్టిక్స్, షేర్డ్ మొబిలిటీ రంగాల్లో పదేండ్ల పాటు పనిచేశారు. ఆ అనుభవంతోనే పుల్కిత్ సీఈవోగా, సిద్ధార్థ్ సీవోవోగా ఢిల్లీలో బ్యాటరీ స్మార్ట్‌ని పెట్టారు.
మొదటి స్టార్టప్ పరాజయం:
దీనికంటే ముందే 2015లో ఇద్దరూ కలిసి ఒక స్టార్టప్ పెట్టారు. అది ఆఫీస్‌ల్లో పనిచేసేవాళ్లకు బస్సు సర్వీసెస్‌ని అందించే ప్లాట్‌ఫాం. అయితే.. పెద్ద మొత్తంలో పెట్టుబడులతో సర్వీసులు అందించే కాంపిటేటర్ల వల్ల అది సక్సెస్ కాలేదు. 2019లో దాన్ని షట్‌డౌన్ చేసి ఈవీల మీద రీసెర్చ్ చేశారు. అప్పుడే టైర్ 2,3 సిటీల్లో ప్రతిరోజూ 10 నుంచి 15 లక్షల ఈవీలు నడుస్తుతున్నాయని తెలుసుకున్నారు. ప్రజా, సరుకు రవాణా, లాస్ట్ మైల్ డెలివరీ/కనెక్టివిటీ కోసం టూ, త్రీ వీలర్ ఈవీల వాడకం విపరీతంగా పెరిగింది. ఈవీలను వాడుతున్న వాళ్ల సమస్యలను, చాలామంది ఈవీలకు దూరంగా ఉండడానికి గల కారణాలు, పరిష్కారాలు అన్వేషించేందుకు రీసెర్చ్ మొదలుపెట్టారు. అప్పట్లో ఈవీల్లో ఎక్కువగా లెడ్–యాసిడ్ బ్యాటరీలను వాడేవాళ్లు. వాటిని ఫుల్ చార్జ్ చేసేందుకు 10–12 గంటలు పట్టేది. దాంతో డ్రైవర్లకు చాలా టైం వృథా అయ్యేది. పైగా ఫుల్ చార్జ్‌తో 50–60 కి.మీ మాత్రమే నడిచేవి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ పుల్కిత్, సిద్ధార్థ్ 2019లో బ్యాటరీ స్మార్ట్ కంపెనీని పెట్టారు.
2.5 మిలియన్లు
‘‘మేము స్టార్టప్ పెట్టేనాటికి ఇండియాలో కొన్ని లక్షల ఎలక్ట్రిక్ రిక్షాలు లెడ్–యాసిడ్ బ్యాటరీలతో నడిచేవి. వాటి ద్వారా దాదాపు ఏడు కోట్ల మందికి సేవలు అందేవి. అయితే.. మన దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర చాలా ఎక్కువని మేము తెలుసుకున్నాం. అందుకే వాటి వినియోగం తక్కువగా ఉంది. పైగా లెడ్–యాసిడ్ బ్యాటరీలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. అది డ్రైవర్లకు అదనపు భారమయ్యేది. అంతేకాకుండా డ్రైవర్లు ప్రతి రోజు రాత్రి 10 నుంచి 12 గంటలు తమ బ్యాటరీలను చార్జ్ చేసేవాళ్లు. పగటిపూట కూడా మరో 3 నుంచి 4 గంటల టైం కేటాయించేవాళ్లు. మేము వాళ్ల టైంని సేవ్ చేసేందుకు టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయాలి అనుకున్నాం. అలా సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో ‘బ్యాటరీ స్వాపింగ్’ చేసుకునే అవకాశం కల్పించాం. దీనివల్ల వెహికల్ కొనేటప్పుడు డ్రైవర్‌కు అయ్యే ఖర్చు 40 శాతం వరకు తగ్గుతుంది”అని చెప్పాడు పుల్కిత్.
మొదటి స్టేషన్
2020 జూన్‌లో ఢిల్లీలోని జనక్‌పురిలో మొదటి స్వాపింగ్ స్టేషన్‌ని ఏర్పాటు చేశారు. అందులో ఆరుగురు ఉద్యోగులు ఉండేవాళ్లు. రోజులో 18 గంటలు స్టేషన్ తెరిచే ఉంటుంది. లాక్‌డౌన్‌లో గ్రాసరీ, మెడిసిన్ డెలివరీ కోసం చాలామంది ఈ– రిక్షాలను వాడారు. ఆ వెహికల్స్‌లో పదే పదే చార్జింగ్ అయిపోయేది. తిరిగి చార్జింగ్ చేయాలంటే చాలా టైం పట్టేది. పైగా బ్యాటరీలు తొందరగా పాడయ్యేవి. అప్పుడే ‘‘బ్యాటరీ కొనాల్సిన అవసరం లేదు.. 2 నిమిషాల్లో స్వాప్ చేసుకోవచ్చు!” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రమోషన్స్ చేశారు. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (బీఏఏఎస్) మోడల్‌తో ముందుకొచ్చింది కంపెనీ. డ్రైవర్లు వెహికల్ మాత్రమే కొంటారు. బ్యాటరీ స్మార్ట్ నుంచి బ్యాటరీలను అద్దెకు తీసుకుంటారు. వాటిని ఎన్నిసార్లైనా స్వాప్ చేసుకోవచ్చు. స్వాప్ చేసిన ప్రతిసారి కొంత డబ్బు వసూలు చేస్తారు. దాంతో రిక్షాల ధర 40 శాతం వరకు తగ్గుతుంది. జనక్‌పురిలోని స్వాపింగ్ స్టేషన్ సక్సెస్ కావడంతో కంపెనీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించారు. ఇప్పుడు ఇండియాలోని 50కి పైగా సిటీల్లో 1,600 స్టేషన్లు ఏర్పాటు చేసి బ్యాటరీ స్వాపింగ్ రంగంలో అగ్రగామిగా అవతరించింది కంపెనీ. అంతేకాదు.. ఇప్పటివరకు 86 మిలియన్ బ్యాటరీ స్వాప్‌లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. దీనిద్వారా ఇప్పుడు నెలకు దాదాపు లక్ష బ్యాటరీలు స్వాప్ చేస్తున్నారు. 90 వేల కంటే ఎక్కువమంది ఇందులో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు.
తక్కువ ఖర్చు
‘‘వినియోగదారులు తమ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్ వెహికల్స్ నుంచి ఈవీలకు మారేలా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. బ్యాటరీ స్వాపింగ్ వల్ల వాళ్లు ఫ్యుయెల్‌ని రీఫిల్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. పైగా పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ ఖర్చవుతుంది. ఒక్క స్వాప్‌కు కస్టమర్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చవుతుంది. ఒక్క బ్యాటరీతో 60 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. కస్టమర్లు తమ అవసరాలకు తగిన విధంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. వెహికల్స్‌లో స్మార్ట్ మీటర్లను బిగిస్తాం. అవి కస్టమర్లకు ఎప్పుడు బ్యాటరీ స్వాప్ చేయాలో సూచిస్తాయి” అని చెప్పాడు సిద్ధార్థ్.
స్వాపింగ్ స్టేషన్లు ఎలా పనిచేస్తాయి:
ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ల వినియోగదారులు బ్యాటరీ స్మార్ట్ యాప్ ద్వారా దగ్గర్లోని స్వాపింగ్ స్టేషన్‌ను ఈజీగా గుర్తించవచ్చు. స్టేషన్ నుంచి కిలోమీటరు వ్యాసార్థంలో ఉన్న తమ నెట్‌వర్క్‌లోని కస్టమర్లకు అవసరమయ్యే బ్యాటరీలు స్టేషన్‌లో ఎప్పుడూ రెడీగా ఉంటాయి. కస్టమర్లు అక్కడికి వెళ్లి రెండు నిమిషాల్లో తన వెహికల్‌లోని బ్యాటరీని ఇచ్చేసి ఫుల్ చార్జ్ చేసిన మరో బ్యాటరీ తీసుకోవచ్చు. ప్రతి స్వాప్‌కి యాప్ ద్వారానే నేరుగా డబ్బులు చెల్లించవచ్చు.
ట్రైనింగ్ తప్పనిసరి:
చిన్న చిన్న పొరపాట్లే బ్యాటరీ పనితీరుపై చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. వాటిని సేఫ్‌గా చార్జ్ చేస్తూ, సరిగ్గా మెయింటెయిన్ చేస్తే లైఫ్ పెరుగుతుంది. అందుకే స్వాపింగ్ స్టేషన్ పార్ట్‌నర్స్‌కి వాటిపై పూర్తి అవగాహన కలిగేవరకు ట్రైనింగ్ ఇస్తారు. బ్యాటరీని సరిగ్గా ఎలా భద్రపరచాలి, చార్జింగ్ డాక్‌కు ఎలా కనెక్ట్ చేయాలి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి.. లాంటివన్నీ నేర్పిస్తారు. అంతేకాదు.. అన్ని బ్యాటరీలకు వోల్టేజ్, టెంపరేచర్లు, కరెంట్ లాంటివాటిని ట్రాక్ చేయడానికి ఐవోటీ పరికరాన్ని బిగిస్తారు. డ్రైవర్లు, పార్ట్‌నర్లకు 24x7 ఆన్–కాల్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు.
అన్నీ ఒకేలా:
వీళ్ల దగ్గర సబ్‌స్క్రప్షన్ తీసుకున్నవాళ్లకు 12–15 కేజీల బరువుండే లిథియం–ఐయన్ బ్యాటరీ (2-2.5 kWh) లు ఇస్తారు. అవి 200కు పైగా మోడల్స్ ఈవీలకు సపోర్ట్ చేస్తాయి. వాటి గురించి వివరిస్తూ పుల్కిత్ ఇలా చెప్పాడు “మేము ఉపయోగించే లిథియం–అయాన్ బ్యాటరీలు ఎలక్ట్రిక్ త్రీ, టూ వీలర్‌లకు అనుకూలంగా ఉంటాయి. వేర్వేరు కంపెనీలు తయారుచేస్తున్నా మా బ్యాటరీలన్నీ స్పెసిఫికేషన్లు, కొలతల్లో ఒకేలా ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇండియాలోని 10కి పైగా బ్యాటరీ తయారీదారుల నుంచి వాటిని కొంటున్నాం. టూ వీలర్లకు ఒక బ్యాటరీ సరిపోతుంది. త్రీ వీలర్లలో రెండు అవసరం అవుతాయి’’.
