యువకులపై బీట్ ఆఫీసర్ దాష్టీకం
చేయని తప్పునకు కర్రలతో దాడి
నేరం ఒప్పుకోవాలని 12 గంటల పాటు నిర్బంధం
యువకుల్లో ఇద్దరు మైనర్లు
కొత్తగూడ, వెలుగు : ఓ బీట్ ఆఫీసర్ యువకులపై దాడి చేయడమే కాక, రెండు సార్లు కొండలు ఎక్కించి, 12 గంటల పాటు నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రేంజ్ పరిధిలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామానికి చెందిన జన్ను సిద్దార్థ, జన్ను సన్నీ, జన్ను శ్రీనాథ్, జన్ను జెస్టీన్ మంగళవారం మధ్యాహ్నం కొత్తగూడ ఫారెస్ట్ లోని చిలకలగుట్టపైకి వెళ్లారు. అక్కడ బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. ఈక్రమంలో అక్కడికి చేరుకున్న బీట్ఆఫీసర్ ఉదయ్ వారిపై కర్రలతో దాడి చేశాడు. వాటర్ ట్యాంక్, రోలింగ్ లను ధ్వంసం చేశారని నెపం మోపి తీవ్రంగా కొట్టాడు. రెండు సార్లు గుట్ట పైకి కిందకి నడిపించాడు. రేంజ్ ఆఫీస్‌కు తరలించి నేరం ఒప్పుకోవాలని తీవ్రంగా కొట్టాడు. తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా వినలేదు. రాత్రి 11గంటల వరకు ఆఫీసులోనే బంధించారు. ఎవరికీ ఫోన్లు చేయకుండా ముందే ఫోన్లు గుంజుకున్నాడు. 11గంటల తర్వాత ఒక బైక్ ఇచ్చి, ఇంకో బైక్ ఇక్కడే పెట్టి మళ్లీ పొద్దున్నే రావాలని ఆదేశించాడు. ఒక్క బైక్ మీద నలుగురు వెళ్లలేక రాత్రంతా రేంజ్ ఆఫీస్ ముందే పడిగాపులు కాశారు. అదే రాత్రి కొత్తగూడకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
తెల్లారే పోలీస్ ఈవెంట్స్..
బుధవారం కుటుంబసభ్యులు కొత్తగూడ రేంజ్ ఆఫీసుకు చేరుకున్నారు. చేయని నేరానికి ఎందుకు హింసించారని బీట్ ఆఫీసర్ ఉదయ్, రేంజర్ వజహాత్ ను నిలదీశారు. అక్కడికి చేరుకున్న గూడూరు ఎఫ్‌డీవో చంద్రశేఖర్ వారితో మాట్లాడి, యువకులను ఇంటికి పంపించారు. కాగా, యువకులలో ఒక్కడైన శ్రీనాథ్ కు ఇయ్యాల వరంగల్ లో పోలీస్ ఈవెంట్స్ ఉన్నాయి. బీట్ ఆఫీసర్ దాడికి కాలు చితికిపోవడంతో ఈవెంట్లకు ఎలా హాజరుకావాలో తెలియక సతమతవుతున్నాడు. కాగా, నలుగురు యువకుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు.
కాజీపేటలో సైన్స్ ఫెయిర్
కాజీపేట్, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్ లోని బిషప్ బెరెట్ట హైస్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ ప్రారంభమైంది. బుధవారం దీనిని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. ఇన్ స్పైర్ నుంచి 135, సైన్స్ ఫెయిర్ నుంచి 175 ప్రాజెక్టులను స్టూడెంట్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టూడెంట్లు భావి సైంటిస్టులు కావాలని ఆకాంక్షించారు. మానవ అభివృద్ధి కోసం వనరులను కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉందన్నారు. స్టూడెంట్ల ఆలోచనలకు టీచర్లు పదును పెట్టాలని సూచించారు. సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న స్టూడెంట్లను టీహబ్‌కు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్ హై, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, 49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస, వరంగల్ బిషప్ ఉడుముల బాల, జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస స్వామి తదితరులున్నారు.
ఎంజీఎంలో సమస్యలు పరిష్కరించాలి
కాశిబుగ్గ, వెలుగు: వరంగల్ ఎంజీఎంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వరంగల్అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడె ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం ఆసుపత్రిని సందర్శించి, వైద్య సేవలపై ఆరా తీశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ఎంజీఎం సూపరింటెండెంట్ సమస్యలపై దృషి పెట్టాలని, పనులకు సంబంధించిన ప్రపోజల్స్ పంపాలన్నారు.
మన బడి పనులు స్పీడప్ చేయండి..
జనగామ అర్బన్: జనగామ జిల్లాలో ‘మన ఊరు–మన బడి’ పనులు త్వరగా పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో ఆయన రివ్యూ చేశారు. ఎంపిక చేసిన 176 బడుల్లో ప్రారంభించిన 12 రకాల పనుల్ని వెంటనే కంప్లీట్ చేయాలన్నారు. మరో 25 సూళ్లలోనూ పనులు చేపట్టేందుకు నిర్ణయించామన్నారు.
పాకాల నీటి విడుదల
నర్సంపేట, వెలుగు: పాకాల చెరువు తైబందీ ఖరారైంది. బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చెరువు తూములను ఓపెన్ చేసి, నీరు విడుదల చేశారు. దీని ద్వారా 14,500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించనున్నట్లు తెలిపారు.
సీలింగ్ భూముల్ని స్వాధీనం చేసుకోవాలి
జనగామ అర్బన్, వెలుగు: భూస్వామి లక్ష్మణ్‌సింగ్ ఆధీనంలో ఉన్న సీలింగ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ ఆధ్వర్యంలో జనగామ తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూంలు, ఇండ్ల జాగలు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలన్నారు. జనగామ లోని రంగప్ప చెరువు మత్తడి నీరు టౌన్ లో ఆగకుండా బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహాముత్తారం, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి సూచించారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి ఫూలే జయంతి నిర్వహించగా.. చీఫ్ గెస్టులుగా మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహర్షిణి మాట్లాడుతూ బాలిక విద్యకు, అంటరాని తనాన్ని రూపుమాపడానికి ఫూలే దంపతులు ఎం తో కృషి చేశారన్నారు. వారి స్ఫూర్తితో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి, స్థానిక సర్పంచ్ మందల లతా రెడ్డి, మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మహిళా లీడర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
పేదల రాజ్యం రావాలి
మొగుళ్లపల్లి(టేకుమట్ల): రాష్ట్రంలో దొరల పాలన పోయి పేదల రాజ్యం రావాలని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఆయన మాట్లాడుతూ.. అగ్ర కులాల పాలనలో పేదలు తరతరాలుగా దోపిడీకి గురయ్యారని ఆరోపించారు. బడుగులకు రాజ్యాధికారం దక్కితేనే బతుకులు మారుతాయన్నారు.
ఏఆర్ సిబ్బందికి ట్రాఫిక్ విధులు
వరంగల్ క్రైం: కమిషనరేట్ లో ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి ట్రాఫిక్ విధులు సైతం కేటాయించాలని వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్ ఆఫీసర్లకు సూచించారు. కమిషనరేట్ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం ఆఫీసర్లతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మారిన పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి విధులు కేటాయించాలన్నారు. ప్రస్తుతం ఉన్న గార్డ్స్ పోస్టులను కుదించాలని, కుదించిన సిబ్బందిని ఇతర విధులకు కేటాయించాలన్నారు. పెట్రోలింగ్ వాహనాల రోజువారీ కదలికల వివరాలను అందజేయాలని, ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులను శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా వినియోగించాలన్నారు. ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్ లో ఉన్న స్పెషల్ పార్టీ సంఖ్యను పెంచాలన్నారు. శాంతి భద్రతల నియంత్రణలో భాగంగా జనగామ జిల్లాలోనూ రిజర్వ్ ఫోర్స్ నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తక్కువ సిబ్బందితో బందోబస్తులను విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్డీసీపీలు సంజీవ్, సురేశ్‌కుమార్, ఏసీపీలు నాగయ్య, అనంతయ్య, సురేంద్ర, ఆర్ఐలు ఉదయభాస్కర్, భాస్కర్, సతీశ్, నగేశ్తదితరులున్నారు.
‘సిగ్నల్స్’ అప్ డేట్ చేయండి
కాశిబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: సిటీలో ఉన్న 14 ట్రాఫిక్ సిగ్నళ్లను పునరుద్ధరించడంతో పాటు మరో4 కొత్త సిగ్నళ్లను ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో అడిషనల్ డీసీపీ(ట్రాఫిక్) పుష్పతో కలిసి రివ్యూ ని ర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ సిగ్నళ్లతో పాటు జీబ్రా లైన్స్, డివైడర్లు ఏర్పాటు చేయాలన్నారు. బల్దియా టౌ న్ ప్లానింగ్, పోలీసులు సంయుక్తంగా పనిచేసి రద్దీ ప్రాంతాలను గుర్తించాలన్నారు. పార్కింగ్ కోసం స్థలాలు పరిశీలించాలన్నారు. సెల్లార్లను పార్కింగ్ కోసమే వినియోగించాలని, రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్లు వేయాలన్నారు.
పీఏసీఎస్ భవన నిర్మాణంపై రగడ
మహాముత్తారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బడి గ్రౌండ్లో నిర్మిస్తున్న పీఏసీఎస్ భవనం, గోదాం నిర్మాణా లపై వివాదం నెలకొంది. ప్రభుత్వ బడి జాగలో ఎలా నిర్మిస్తామని ప్రజా సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. రెండ్రోజులుగా ఆందోళన చేస్తున్నారు. బుధవారం సైతం నిర్మాణ పనుల్ని అడ్డుకున్నారు. స్టూడెంట్ల కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు చేపట్ట డం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం ఎంపీడీ వో రవీంద్రనాథ్‌కు వినతిపత్రం అందచేశారు.
కరోనా మళ్లీ మోపైంది..
జాగ్రత్తలతో జాతర నడపాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఐనవోలు, వెలుగు: కరోనా మళ్లీ విజృంభిస్తోందని, ఆఫీసర్లు జాగ్రత్తలు పాటించి ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరను సక్సెస్ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వచ్చే జనవరి 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర ఏర్పాట్లు, నిర్వహణపై ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన జిల్లా ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో దాదాపు 10లక్షల మంది భక్తులు వస్తారని, ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర నాటికి కరోనా తీవ్రమైతే మెడికల్ క్యాంపులు పెట్టాలన్నారు. జాతరకు సమయం తక్కువగా ఉందని, వెంటనే పనులు మొదలుపెట్టాలన్నారు. మల్లన్న క్షేత్రంలో శాశ్వత పనుల కోసం సమగ్రంగా ప్రతిపాదనలు తయారు చేస్తే సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి అప్రూవల్ తీసుకొస్తానన్నారు. హరిత హోటల్‌కూడా చాలా ముఖ్యమని, స్వయంగా తానే చొరవ తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే ఆలయ ఆవరణలో దాదాపు రూ.10 కోట్ల పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని, అవన్నీ తొందర్లోనే పూర్తవుతాయన్నారు. ఢిల్లీ నుంచి రూ.5 కోట్ల పనికి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వరంగల్ సీపీ రంగనాథ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, ఎండోమెంట్అసిస్టెంట్ కమిషనర్ సునీత, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి ఉన్నారు.
పోలీసులు నిర్భయంగా డ్యూటీ చేయాలి
వరంగల్ సిటీ, వెలుగు: లా అండ్ ఆర్డర్ లో ప్రజాప్రతినిధులు తలదూర్చరని, పోలీసులు నిర్భయంగా డ్యూటీ చేసి, చట్టాన్ని కాపాడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. బుధవారం వరంగల్ ఏనుమాములలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ను సీపీ రంగనాథ్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో పోలీస్ స్టేషన్ కు వాహనం కూడా ఉండేది కాదని, కేసీఆర్ వచ్చాక మోడ్రన్ వెహికల్స్ పంపిణీ చేశారన్నారు. ఏనుమాములకు గొప్ప చరిత్ర ఉందని, దానిని నిరంతరం కాపాడాలన్నారు. సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఏనుమాముల పీఎస్ ఎంతో కీలకమని, చుట్టుపక్కల 15 గ్రామాలకు, రైతులకు సేవలందిస్తుందన్నారు. ఈ పీఎస్ పరిధిలోకి రెడ్డిపాలెం, కారల్ మార్క్స్ నగర్, ఏనుమాముల, ఎన్టీఆర్ నగర్, సుందరయ్య నగర్, బాలాజీ నగర్, గణేశ్‌నగర్, ఎస్ఆర్ నగర్, మణికంఠ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, సాయి గణపతి, లక్ష్మీ గణపతి కాలనీ, ఏనుమాముల మార్కెట్, పైడిపల్లి, ఆరెపల్లి, కొత్తపేట గ్రామాలు వస్తాయన్నారు. ఈ పీఎస్ కు ఇన్స్పెక్టర్ గా ‘చేరాలు’ను నియమించామన్నారు. ఈయనతో పాటు ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుల్స్, 8 మంది కానిస్టేబుళ్లు అందుబాటులో ఉంటారన్నారు.
రైతు బంధు కన్వీనర్ సంజీవరెడ్డి మృతి
బచ్చన్నపేట, వెలుగు: బచ్చన్నపేట మండల రైతుబంధు కన్వీనర్ కల్లూరి సంజీవరెడ్డి బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇతని కొడుకు వైస్ ఎంపీపీ. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట రైతుబంధు జిల్లా కన్వీనర్ ఇర్రి రమణారెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ షబ్బీర్ తదితరులున్నారు.
