
గుజరాత్ హైకోర్టు గుమాస్తా ఉద్యోగాలకు జరిగిన పరీక్షకు ఆరు నెలల శిశువు తల్లి హాజరైంది. ఆమె పరీక్ష రాస్తుండగా అహ్మదాబాద్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆమె బిడ్డ ఆలనాపాలనా చూసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. అహ్మదాబాద్ పోలీసులు తమ అధికార ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేశారు. చిన్నారిని లాలించడం పట్ల మహిళా కానిస్టేబుల్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఫొటోల్లో మహిళా కానిస్టేబుల్ చిన్నారిని ఎత్తుకుని ఆపై ఆటలాడటం కనిపిస్తుంది. హైకోర్టులో గుమాస్తా పోస్టులకు ఆదివారం (జులై 9న) పరీక్ష జరిగింది. పరీక్ష ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు మహిళా అభ్యర్థి బేబీ ఆపకుండా ఏడుస్తుండటం అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ దయా బెన్ కంటపడింది. దీంతో చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని మహిళను పరీక్షా కేంద్రంలోకి పంపింది. ‘‘మీరు పరీక్ష రాసేందుకు వెళ్లండి..మీ బిడ్డను నేను చూసుకుంటాను’’ అని భరోసా ఇచ్చింది. పరీక్ష కేంద్రం వద్ద కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించడమే కాకుండా.. చిన్నారిని కూడా చూసుకుంది.