
ఓ జంట పద్దెనిమిది ఏండ్లపాటు పిల్లల కోసం పరితపించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. కానీ.. ఇప్పుడు ఏఐ వల్ల వాళ్ల కల నెరవేరింది. అదెలాగంటే..
న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్‌లో ఎస్‌టీఏఆర్ (స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ) అనే ఏఐ టెక్నాలజీని డెవలప్ చేశారు. సాధారణంగా అజోస్పెర్మియాతో బాధపడుతున్న పురుషుల వీర్యంలో వీర్యకణాలు చాలా తక్కువగా ఉంటాయి. సంప్రదాయ పద్ధతుల్లో పరిశీలించి వాటిని గుర్తించడం చాలా కష్టం. అలాంటి సమస్యతోనే బాధపడుతున్న ఒక వ్యక్తి ఈ ఫెర్టిలిటీ సెంటర్‌ని సంప్రదించాడు. డాక్టర్లు సాధారణ పద్ధతిలో రెండు రోజులు పరిశీలించినా వీర్యంలో వీర్యకణాలను గుర్తించలేకపోయారు. కానీ.. ఈ స్టార్ టెక్నాలజీతో కేవలం గంటలోనే గుర్తించగలిగారు. ఆ తర్వాత వాటిని ఐవీఎఫ్ పద్ధతిలో గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. ఆమె ఈ విధానంలో గర్భం దాల్చిన తొలి మహిళగా గుర్తింపు పొందింది.
►ALSO READ | కార్పొరేట్ జాబ్ వదిలి కంపోస్ట్ ఎరువుల తయారీ.!..ఏటా రెండున్నర కోట్ల సంపాదన
ఈ ఏఐ టెక్నాలజీని ఇమేజింగ్ టెక్నాలజీ సాయంతో రూపొందించారు. ఇది ప్రస్తుతం కొలంబియాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ విధానంలో స్పెర్మ్ రిట్రీవల్‌కు 3,000 డాలర్ల కంటే తక్కువగానే ఖర్చవుతుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవాళ్లకు చేసే సంప్రదాయ ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ.