- వేగంగా విస్తరిస్తున్న ప్రమాదకర స్ట్రెప్టోకోకల్ వ్యాధి
- 48 గంటల్లోనే కణజాలాన్ని నాశనం చేస్తూ ప్రాణం తీసేస్తది
- ఈ ఏడాది ఇప్పటికే 977 కేసులు నమోదు
టోక్యో : జపాన్ లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది మనిషి శరీరంలోకి చేరిన వెంటనే అవయవాల్లోని కణజాలాన్ని నాశనం చేస్తూ రెండు రోజుల్లోనే ప్రాణాలను హరిస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పోయిన ఏడాది కన్నా ఈ ఏడాది ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్ అనే ఈ బ్యాక్టీరియా వల్ల మనుషులకు స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (ఎస్టీఎస్ఎస్) అనే వ్యాధి వస్తుందని సైంటిస్టులు వెల్లడించారు.
జపాన్ లో పోయిన ఏడాది మొత్తంలో 941 ఎస్టీఎస్ఎస్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జూన్ 2 నాటికే 977 కేసులు రికార్డ్ అయ్యాయని ఆ దేశ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఐడీ) సంస్థ తెలిపింది. దేశంలో ప్రధానంగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఈ బ్యాక్టీరియా వ్యాప్తి క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ రకానికి చెందిన స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్ బ్యాక్టీరియా మనుషుల పేగుల్లో తిష్ట వేస్తుంది.
ఆ తర్వాత మల అవశేషాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా గాయాలు, పుండ్ల ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ వెంటనే అవయవాలలోని కణజాలాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది” అని ఎన్ఐఐడీ పేర్కొంది. ప్రధానంగా కణజాలాన్ని చంపేస్తుంది కాబట్టి.. దీనిని ‘మాంసం తినే’ బ్యాక్టీరియాగా పిలుస్తున్నారని వివరించింది. దీనివల్ల పిల్లల్లో గొంతు వాపు కూడా వస్తుందని తెలిపింది. 50 ఏండ్లు పైబడిన వారికి ఇది ప్రాణాంతకంగా మారుతుందని తెలిపింది.