
తెలంగాణ రాస్ట్రంలో భూ రికార్డుల కోసం తీసుకువచ్చిన ధరణి సాఫ్ట్ వేర్ తో అసైన్డ్ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుందని మంత్రి సీతక్క ఆరోపించారు. అసెంబ్లీలో శుక్రవారం ధరణి సైట్ పై చర్చ జరిగింది. ధరణిలో జరిగిన తప్పుల కారణంగా అధికారులపై దాడులు జరిగాయన్నారు సీతక్క. రైతులు ధరణి అంటేనే భయపడుతున్నారని ఆమె అన్నారు. గ్రామాల్లోకి వెళ్తే ధరణి ఎప్పుడు మార్చుతారని రైతులు అడుగుతున్నారని సీతక్క అసెంబ్లీలో చెప్పారు. ధరణితో మళ్లీ కొందరి చేతుల్లోకే భూమి వెళ్తోందన్నారు సీతక్క.
ధరణి పేరుతో పేద రైతుల భూములు గుంజుకొని, వారికి అన్యాయం చేశారని మంత్రి సీతక్క అన్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌కు తూట్లు పొడుస్తున్నారని ఆమె అన్నారు. ధరణి సమస్యలతో రైతులు రోడ్డున పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ లా తొందరపడి తప్పులు చేయమన్నారు. ధరణిని రద్దు చేసి, దానిలోని మంచి విషయాలు ఉంటే స్వీకరిస్తామని అన్నారు. హైదరాబాద్ లో వక్ఫ్ బోర్డ్ భూములు వేల ఎకరాలు కబ్జాకు గురైందని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.