ఉన్నది 3 గుంటలైతే.. 200 ఎకరాలకు పట్టాలిచ్చిన్రు!

ఉన్నది 3 గుంటలైతే.. 200 ఎకరాలకు పట్టాలిచ్చిన్రు!

బెల్లంపల్లి, వెలుగు: రూలింగ్ పార్టీ లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్లు కుమ్మక్కై మూడు గుంటల భూమిని పట్టుకొని ఏకంగా 200 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన్రు. ఒకటి కాదు.రెండు కాదు.. 52 దొంగ పట్టాలు సృష్టించిన్రు. వాటి సాయంతో లక్షల్లో క్రాప్​లోన్లు తీసుకోవడంతోపాటు ఏటా రెండుసార్లు రైతుబంధు పొందుతున్నరు. ఏళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా కథ నడిపించిన్రు. కొందరు అవినీతి రెవెన్యూ ఆఫీసర్ల లీలలకు పరాకాష్టగా నిలుస్తున్న ఈ భూదందా మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

రికార్డుల్లో లావుని పట్టాలుగా.. 

కన్నెపల్లి మండలానికి చెందిన కొంతమంది రూలింగ్ పార్టీ లీడర్లు రెవెన్యూ ఆఫీసర్లతో కుమ్మక్కై పక్కా ప్లాన్ తో జజ్జరవెల్లిలో లేని భూమికి పట్టాలు వచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. జజ్జరవెల్లిలో మూడు గుంటల బీడీపీపీ(బిలాదాఖల పోరంబోకు) ల్యాండ్​ఉంది. ఈ భూమిని చూపిస్తూ రెవెన్యూ ఆఫీసర్లు సర్వే నంబర్1కి బై నంబర్లు వేసుకుంటూ 1/1ఏ నుంచి 1/52 వరకు 52 మందికి పట్టాదారు పాస్​బుక్​లు ఇచ్చారు. వాటిని లావుని పట్టాలుగా రికార్డుల్లో నమోదు చేశారు.

రెండేళ్లుగా.. 

అక్రమంగా పట్టాలు పొందినవారు వాటితో రెండేళ్లుగా బ్యాంకుల్లో క్రాప్​లోన్లు తీసుకుంటున్నారు. ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుబంధు పొందుతున్నారు. వాస్తవానికి రైతులు సాగు చేస్తున్న భూములకు పంట సాయం అందించడం సర్కారు ఉద్దేశం. కానీ ఇక్కడ లేని సర్వే నంబర్లకు రెవెన్యూ ఆఫీసర్లు పట్టాలు ఇస్తే.. అగ్రికల్చర్ ఆఫీసర్లు గుడ్డిగా రైతుబంధు సాయం అందిస్తున్నారు. ఇది చాలదన్నట్టు బ్యాంకుల్లో అక్రమ పాస్​బుక్కులు పెట్టి లక్షల్లో క్రాప్ లోన్లు పొందడం విస్మయానికి గురిచేస్తోంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు అందిన కాడికి దండుకోవడమే 
లక్ష్యంగా కొంతమంది రైతులను ముందుపెట్టి ఈ తతంగాన్ని నడిపించారనే ఆరోపణలు వస్తున్నాయి. 

టీఆర్ఎస్​ లీడర్​ ఇంట్లోనే..

టీఆర్ఎస్​ప్రభుత్వం 2018లో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఆ టైంలో భీమిని మండలం నుంచి కన్నెపల్లిని వేరుచేసి మండలంగా ప్రకటించింది. ఆ టైంలో కన్నెపల్లి తహసీల్దార్​ఆఫీసును బెల్లంపల్లిలోని ఓ రూలింగ్​పార్టీ లీడర్​కు చెందిన బిల్డింగులో రెండు నెలలపాటు నిర్వహించారు. అప్పుడు సదరు లీడర్ రెవెన్యూ ఆఫీసర్లతో కుమ్మక్కై తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు పట్టాలు ఇప్పించేదుకు ప్లాన్​చేశాడు. ఒక్కో ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. సదరు లీడర్​ కనుసన్నల్లోనే దందా జరగగా.. అప్పటి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పూర్తిగా సహకరించినట్లు తెలుస్తోంది.
మరో చోట దున్నతున్నరు

అక్రమంగా పట్టాలు పొందిన కొంతమంది ‘పట్టాలు ఉన్నాయి.. భూములు లేవంటూ’ జజ్జరవెల్లిని ఆనుకొని ఉన్న జన్కాపూర్​లోని బిలాదాఖల భూమిని దున్నుతున్నారు. లేని భూమికి పట్టాలు ఇవ్వడం ఒక ఎత్తయితే.. తప్పును ఒప్పు చేసేందుకు పక్క గ్రామ శివారులోని అదే బీడీపీపీ ల్యాండ్​పేరిట కబ్జా చేస్తుండడం మరొక ఎత్తు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కన్నెపల్లి తహసీల్దార్ రాంచందర్​ను వివరణ కోరగా భూమి ఉన్న చోటనే పట్టాలు ఇచ్చామని చెప్పడం గమనార్హం.