కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల జోరు

కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల జోరు

కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో మరి కొన్ని పతకాలు చేరనున్నాయి. ఉమెన్స్  45 కేజీల  క్వార్టర్ ఫైనల్స్లో  బాక్సర్ నీతూ గంగాస్..నికోల్ క్లైయిడ్ను ఓడించింది. నార్తర్న్ ఐర్లాండ్ కు చెందిన  నికోల్  క్లైయిడ్పై  ఏబీడీ ద్వారా విజయం సాధించి  సెమీస్ కు చేరుకుంది. దీంతో సెమీస్ లో నీతూ గెలిచినా..ఓడినా భారత్ కు ఖచ్చితంగా పతకం దక్కనుంది.

అటు మెన్స్ 57  కేజీల  విభాగంలో బాక్సర్ హుసాముద్దీన్ 4-1 తేడాతో నమీబియా బాక్సర్ ఎన్.టీ. మార్నింగ్ పై విజయం సాధించాడు. దీంతో  సెమీస్ కు అర్హత సాధించి..హుసాముద్దీన్ కూడా పతకం ఖాయం చేసుకున్నాడు. 

పూల్-ఏలో భాగంగా జరిగిన క్వార్టర్స్లో భారత మహిళల హాకీ జట్టు  కెనడాపై 3-2 తేడాతో విజయం సాధించింది.  సలైమా 3వ నిమిషంలోనే గోల్ చేయగా నవనీత్ కౌర్ 22వ నిమిషంలో గోల్ చేసి భారత ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. ఈ సమయంలో పుంజుకున్న కెనడా..23వ నిమిషంలో  బ్రియాన్ స్టేర్స్ గోల్ కొట్టింది.  39వ నిమిషంలో  హన్నా  మరో గోల్  చేసింది.  ఆట చివరి దశలో  51వ నిమిషంలో సంగీత కుమారి గోల్ కొట్టడంతో భారత్ 3-2తో  విజయం సాధించి సెమీస్కు చేరుకుంది. 

జూడో పోటీల్లో ఉమెన్స్  78 కిలోల ఈవెంట్లో  భారత అథ్లెట్ తులిక మన్ ఫైనల్కు చేరుకుంది.  సెమీస్ లో ఆమె  న్యూజిలాండ్కు చెందిన సిడ్నీ ఆండ్రూస్ను ఓడించి ఫైనల్కు అర్హత సాధించింది. దీంతో జూడోలో  భారత్కు స్వర్ణం లేదా  రజతం దక్కే అవకాశం ఉంది.  ఫైనల్లో  తులిక స్కాట్లాండ్ అథ్లెట్ సారా అడ్లింగ్టన్తో పోటీ పడనుంది.