
జూబ్లీహిల్స్ వెలుగు: డబ్బుల విషయంలో గొడవ కావడంతో ఓ యువకుడిని సమీప బంధువు హత్య చేశాడు. బోరబండ ఎస్ హెచ్ వో సురేందర్ తెలిపిన ప్రకారం.. కర్నాటకకు చెందిన బస్వరాజ్ (21), ప్రేమ్ రాజ్ (22) సమీప బంధువులు. వీరిద్దరు కొంత కాలంగా బోరబండ పోలీస్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ ఫేజ్-1లో నివసిస్తూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. బస్వరాజును అందరి ముందు ప్రేమ్‌రాజ్ చెప్పుతో కొట్టాడు. దీంతో బస్వరాజు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చాడు.
సోమవారం పోలీసులు ప్రేమ్‌రాజ్‌ను పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పడంతో కోపోద్రిక్తుడయ్యాడు. నేరుగా బస్వరాజ్ ఇంటికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి నిద్రలో ఉన్న బస్వరాజ్‌ను గ్రానైట్ బండతో తలపై కొట్టి చంపేశాడు. నిందితుడు ప్రేమ్‌రాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోరబండ పోలీసులు తెలిపారు.