V6 News

నిర్మల్ జిల్లాలో దారుణం.. 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట దహనం

నిర్మల్ జిల్లాలో దారుణం.. 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట దహనం

నిర్మల్ జిల్లాలో అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కుబీర్ మండలం పార్డి (కె) గ్రామ శివార్లలో మధ్యాహ్నం ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. రైతుల ఆశలను బూడిద చేశాయి.పొలాల్లో కోసి ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. 

చూస్తుండగానే అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఎండ తీవ్రతకు తోడు, ఈదురు గాలులు తోడవడంతో మంటలు క్షణాల్లో ఇతర పొలాలకు వ్యాపించాయి.సుమారు 20 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. మంటలను గమనించిన రైతులు, స్థానికులు వాటిని అదుపు చేసేందుకు ప్రాణాలకు తెగించి ప్రయత్నించారు. కానీ గాలుల ధాటికి మంటలు అదుపులోకి రాలేదు.

కళ్లముందే చేతికొచ్చిన పంట కాలి బూడిదవుతుంటే.. రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పులు తెచ్చి సాగు చేస్తే, చివరి నిమిషంలో ప్రకృతి వైపరీత్యం తమను నిలువునా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.