నిధులు మేమే తెచ్చాం.. కాదు మేమే తెచ్చాం ..బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

నిధులు మేమే తెచ్చాం.. కాదు మేమే తెచ్చాం ..బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం
  •     రైల్వే అండర్ బ్రిడ్జి శంకుస్థాపన రసాభాస

అల్వాల్‌, వెలుగు: అల్వాల్ మచ్చ బొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. అల్వాల్ నుంచి బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ మధ్య జనప్రియ అపార్ట్​మెంట్స్ సమీపంలో రూ.6.6 కోట్లతో చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి నెం.739 అదనపు వెంట్ నిర్మాణ పనులకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా నిధులు తామే తీసుకువచ్చామంటే..కాదు తాము తీసుకువచ్చామంటూ  బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వాదులాడుకున్నారు. అలాగే, శంకుస్థాపన దగ్గర ఏర్పాటు చేసిన  బ్యానర్​లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​ రెడ్డి ఫొటో పెట్టలేదని బీఆర్​ఎస్​ లీడర్లు గొడవకు దిగారు.  ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో  ఘర్షణ వాతావరణం నెలకొంది.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రొటోకాల్ పాటించాలని, ఇనాగ్రేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రధాని, ముఖ్యమంత్రి ఫొటోలు ఉంచాలని, స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలని సూచించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.