సూర్యాపేటలో దారుణం.. మున్సిపల్ ఉద్యోగిపై గొడ్డలితో దాడి

సూర్యాపేటలో దారుణం.. మున్సిపల్ ఉద్యోగిపై గొడ్డలితో దాడి

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ కాలనీ ఫేస్ 3కి చెందిన  ఓ వ్యక్తి మున్సిపల్ ఉద్యోగిపై గొడ్డలితో దాడి చేశాడు. ఫేస్ 3లో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడని సమాచారం అందుకున్న మున్సిపాలిటీ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్రమ నిర్మాణం ఆపమన్నందుకు కోపంతో ఆ వ్యక్తి మున్సిపల్ అధికారిపై ఘర్షణకు దిగాడు.

ఆవేశంతో ఒక్కసారిగా గొడ్డలి తీసుకొని మున్సిపల్ ఉద్యోగిపై దాడి చేశాడు. ఈ ఘటనలో మున్సిపల్ ఉద్యోగి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయాలు పాలైన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉంది. దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మున్సిపల్ సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.