పోలీసుల దెబ్బలకు మరొకరు బలి

పోలీసుల దెబ్బలకు మరొకరు బలి
  • పేకాడుతుండగా పట్టుకుని చితకబాదిన పోలీసులు
  • గాంధీలో చికిత్స పొందుతూ మృతి

పిట్లం, కామారెడ్డి, వెలుగు: పోలీసులు కొట్టిన దెబ్బలకు మరొకరి ప్రాణం పోయింది. పేకాడుతున్న వారిపై దాడి చేసి చితక్కొట్టడంతో గాయపడ్డ ఓ వ్యక్తి గాంధీలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. ఈ దారుణం కామారెడ్డి జిల్లాలో జరిగింది. బిచ్కుంద మండలం శాంతపూర్ లో ఈ నెల 4న దీపావళి రోజు పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న వాళ్లను చితక్కొట్టడంతో భూమ బోయి (50) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని నిజామాబాద్​ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దాడిని నిరసిస్తూ మర్నాడు బంధువులు, గ్రామస్తులు బిచ్కుంద పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. భూమ బోయి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇందుకు పోలీసుల దెబ్బలే కారణమని భూమ భార్య లచ్చవ్వ ఆరోపించింది.

అనారోగ్యంతోనే భూమ చనిపోయాడంటూ లెటర్​పై సంతకం పెట్టాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. స్థానిక ప్రజాప్రతినిధులు కలగజేసుకుని భార్య, బంధువులతో మాట్లాడటంతో శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం జరిపారు. తామెవరినీ కొట్టలేదని, స్థావరంలో పట్టుబడ్డవాళ్లను వీడియో తీశామని బాన్స్​వాడ డీఎస్పీ జైపాల్​రెడ్డి తెలిపారు. ‘‘అక్కడ ఎవరినీ కొట్టలేదు. భూమను స్టేషన్​కు కూడా తీసుకురాలేదు. అక్కడే వివరాలు తీసుకున్నాం. ఫిట్స్​వచ్చికింద పడిపోవడంతో ఆస్పత్రికి తరలించాం. హార్ట్ స్ట్రోక్​తో చనిపోయినట్లు డాక్టర్లు రిపోర్టిచ్చారు” అని కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటించింది.