
శేరిలింగంపల్లి, వెలుగు: భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ బిల్డింగ్ పైనుంచి దూకి ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. కరీంనగర్‌కు చెందిన మార్కండేయ, రాధ దంపతుల కూతురు శ్రీవిద్య(27), వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన బంధువు శబరీశ్ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో గత ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లోని చందానగర్‌లో శ్రీదేవి థియేటర్ఎదురుగా ఉన్న ఇంట్లో రెంటుకు ఉంటూ దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ జాబ్‌లు చేస్తున్నారు. పెళ్లయిన కొన్ని రోజుల నుంచే భార్యని శబరీశ్ వేధిస్తున్నాడు. చందానగర్‌లోనే ఓ అపార్టుమెంట్లో తన అక్క వద్ద ఉంటున్న తల్లిదండ్రులకు శ్రీవిద్య పలుసార్లు తన బాధను చెప్పుకొంది. కుటుంబసభ్యులు ఆమెకు నచ్చజెప్పారు. ఈనెల14న శబరీశ్ పార్టీ ఉందని చెప్పి బెంగళూరు వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం శ్రీవిద్య తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అదే సమయంలో భర్త ఫోన్ చేయడంతో ఘర్షణ పడుతూనే ఐదో అంతస్తు పైకి వెళ్లి కిందకు దూకింది. తీవ్ర గాయాలవడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.