ఆఫ్ఘన్ లో భూకంపం..సహాయక చర్యల్లో జాప్యం

ఆఫ్ఘన్ లో భూకంపం..సహాయక చర్యల్లో జాప్యం

అఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపంతో మృతుల సంఖ్య అంతకంతా పెరుగోతోంది. ఖోస్ట్  ప్రావిన్స్ పరిధిలోని పాక్ సరిహద్దులో పక్టికా కేంద్రంగా భూమి కంపించింది. భారీ భూకంపంతో వెయ్యి మందికి పైగా చనిపోయారు. మరో 15 వందల మందికిపైగా గాయపడ్డారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.1 గా నమోదైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడ్డ వారికి హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. తెల్లవారుజామున భూకంపం రావడంతో నిద్రలోనే చాలా మంది చనిపోయారు. ఇండ్ల పైకప్పులు కూలడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. బర్మాలా, జిరుక్, నాకా, గయన్ జిల్లాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. దాదాపు 2 వేల ఇండ్లు దెబ్బతిని ఉంటాయని అంచనా వేస్తున్నారు. 

సహాయక చర్యల్లో జాప్యం కొనసాగుతోంది. వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు.. అంతర్జాతీయ సహాయక బృందాలు ముందుండి తమ సేవలను అందిస్తాయి. అఫ్ఘాన్  తాలిబాన్ల హస్తగతమైన తర్వాత హింస కారణంగా.. పలు స్వచ్ఛంద సంస్థలు, విపత్తు నిర్వహణ బృందాలు దేశాన్ని వీడాయి. రెడ్ క్రాస్, ఐక్యరాజ్య సమితి మినహా.. విపత్తు నిర్వహణ విభాగాలు అఫ్ఘాన్ లో దాదాపుగా లేవు. దీంతో.. సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. మరోవైపు  క్షతగాత్రులకు రోడ్లపైనే చికిత్స అందిస్తున్నారు. 

కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగి పడే ప్రాంతాలు కావటం, పురాతన భవనాలు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటకం కలుగుతోంది. గత రెండు దశాబ్దాల్లో ఇదే భారీ భూకంపంగా పేర్కొన్నారు అధికారులు. మరోవైపు ఆఫ్గాన్ కు బృందాలను పంపించి సాయపడాల్సిందిగా తాలిబన్ల సర్కార్ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.