- వృద్ధ దంపతులకు మద్దతుగా రూ.4.6 కోట్ల విరాళాల సేకరణ
వాషింగ్టన్: భార్య వైద్య ఖర్చుల కోసం 78 ఏండ్ల వృద్ధుడు డెలివరీ బాయ్అవతారమెత్తాడు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో తప్పని పరిస్థితుల్లో అమెరికాలోని మాంచెస్టర్‌కు చెందిన రిచర్డ్ పుల్లీ అనే వృద్ధుడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అయితే రిచర్డ్ పుల్లీ డోర్ డెలివరీ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మానవతా దృక్పథాన్ని చాటుకున్న నెటిజన్లు ఆయనకు మద్దతుగా రూ.4 కోట్లకు పైగా విరాళాలు పోగుచేశారు. బ్రిటానీ స్మిత్అనే ఇంటికి స్టార్‌బక్స్ ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు రిజర్డ్పుల్లీ వెళ్లాడు.
వయసు పైబడినప్పటికీ, నిదానంగా అడుగులు వేస్తూ ఆర్డర్‌ను తీసుకురావడాన్ని రింగ్ కెమెరాలో చూసిన సదరు మహిళ చలించిపోయింది. ఆయన గురించి తెలియజేస్తూ సహాయం చేయాలని ‘ఎక్స్’లో వీడియో పోస్ట్చేసింది. అంతేకాదు ‘గో ఫండ్‌మీ’ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించింది. వేల సంఖ్యలో ప్రజలు స్పందించి ఈ భారీ మొత్తాన్ని విరాళంగా అందజేశారు. మొత్తం సుమారు 500,000 డాలర్లు (దాదాపు రూ.4.6 కోట్లు) పోగయ్యాయి. ఆ డబ్బు మొత్తాన్ని వృద్ధ దంపతులకు బ్రిటానీ అందజేశారు.
