హైదరాబాద్, వెలుగు: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కలల సాకారం కోసం ‘తెలంగాణ రైజింగ్ –2047’ విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రాన్ని భౌగోళికంగా కాకుండా, అభివృద్ధి ప్రామాణికంగా మూడు విభిన్న జోన్లుగా (క్యూర్-, ప్యూర్,- రేర్) విభజించిన రాష్ట్రంగా తెలంగాణ నిలవనుండటం ఈ విజన్ డాక్యుమెంట్ ప్రత్యేకత. గ్లోబల్ సమిట్ వేదికగా మొత్తం 83 పేజీల డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రజల ముందు ఉంచింది. ఈ విజన్ డాక్యుమెంట్లో హెల్త్ సెక్టార్‌కు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఏకంగా రూ.30 వేల కోట్లతో రాష్ట్ర వైద్య రంగం స్వరూపాన్ని మార్చేసేలా ప్రణాళికలు రూపొందించింది.
హెల్త్ సెక్టార్లో 30 వేల కోట్లు
2047 నాటికి రాష్ట్రంలో వైద్య రంగం స్వరూపాన్ని మార్చేసేలా రూపొందించిన ‘విజన్ డాక్యుమెంట్’లో రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలను ప్రతిపాదించింది. ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా.. ప్రజల జేబుకి చిల్లు పడకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ఈ విజన్ ముఖ్య ఉద్దేశంగా పేర్కొంది. వచ్చే రెండేళ్లలో దాదాపు 30 వేల కోట్లు వైద్య మౌలిక వసతులపై ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.
నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ కేర్
30+ స్క్రీనింగ్: 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
క్యాన్సర్ చికిత్స: రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేర్ నెట్‌వర్క్ విస్తరణ. డయాలసిస్ కేంద్రాలు, డే-కేర్ కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు
క్యూర్,ప్యూర్,రేర్ మోడల్: దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు, అరుదైన వ్యాధుల చికిత్సకు ప్రత్యేక విధానం
డిజిటల్ హెల్త్ అండ్ టెక్నాలజీ
డిజిటల్ హెల్త్ కార్డ్స్: రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్. పేషెంట్ హిస్టరీ ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు
టెలి-మెడిసిన్: మారుమూల గ్రామాలకు కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు అందేలా టెలి-ఐసీయూ, టెలి-కన్సల్టేషన్ సేవలు. వ్యాధుల గుర్తింపులో, స్క్రీనింగ్‌లో ఏఐ వినియోగం.
ఫార్మా - లైఫ్ సైన్సెస్.. భారీ విస్తరణ
ఔషధ రంగంలో హైదరాబాద్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది.
బయోలాజికల్ ఈ: టీకాలు, పరిశోధనఅభివృద్ధి కోసం రూ. 3,500 కోట్లు (3 వేల ఉద్యోగాలు)
అరబిందో ఫార్మా: విస్తరణ కోసం రూ.2000 కోట్లు (3 వేల ఉద్యోగాలు)
హెటెరో: మందుల తయారీ యూనిట్ల కోసం రూ.1,800 కోట్లు (9 వేల ఉద్యోగాలు)
గ్రాన్యూల్స్ ఇండియా: రూ. 1,200 కోట్లు (3 వేల ఉద్యోగాలు)
భారత్ బయోటెక్: రూ. 1,000 కోట్లు (200 ఉద్యోగాలు)
బయోవరం: టిష్యూ ఇంజినీరింగ్ కోసం రూ. 250 కోట్లు
విజ్జీ హోల్డింగ్స్: డిజిటల్ ట్విన్ హెల్త్ పరిశోధన కేంద్రం
అనలాగ్ ఏఐ : గ్లోబల్ రీసెర్చ్ ల్యాబ్

