నెల వయసున్న చిన్నారిని  ఎత్తుకెళ్లి చంపిన వీధి కుక్కలు

నెల వయసున్న చిన్నారిని  ఎత్తుకెళ్లి చంపిన వీధి కుక్కలు

జైపూర్: రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దారుణం జరిగింది. సిరోహి జిల్లాలోని  ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల వయసున్న చిన్నారిని వీధి కుక్కలు నోట కరుచుకుని బయటకు తీసుకెళ్లాయి. చిన్నారి కడుపును గోర్లతో చీల్చడంతో పాటు ఒక చేతిని తినేశాయి. దాంతో అభంశుభం తెలియని పసికందు ప్రాణం పోయింది. సిరోహిలోని పిండ్వారా గ్రామానికి చెందిన మహేంద్ర మీనా, రేఖ దంపతులు. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొంతకాలంగా మహేంద్ర మీనా సిలికోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. దాంతో ట్రీట్మెంట్ కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అతడిని చూసుకోవడానికి ముగ్గురు పిల్లలను తీసుకుని రేఖ కూడా ఆస్పత్రికి వెళ్లింది. సోమవారం అర్ధరాత్రి మహేంద్ర మీనా ఆస్పత్రి బెడ్ మీద పడుకోగా.. రేఖ తన ముగ్గురు పిల్లలతో కలిసి అక్కడే నేలపై పడుకుంది.

తెల్లవారుజామున 2 గంటలకు వీధి కుక్కలు ఆస్పత్రిలోకి ప్రవేశించి రేఖ చిన్న కొడుకు వికాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నోట కరుచుకుని బయటకు తీసుకెళ్లాయి. చిన్నారి ఏడుపు విని నిద్రలేచిన తల్లి.. వీధి కుక్కలు తన కొడుకును ఎత్తుకెళ్లడం చూసి ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించింది. వాళ్లు వెళ్లి బయట వెతకగా అప్పటికే చిన్నారి కడుపును కుక్కలు చీల్చేశాయి. ఒక చేతిని కూడా తినేయడంతో చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డ చావుకు కారణమని ఆ దంపతులు ఆరోపించారు. ఆస్పత్రి బయట పసికందు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

రెండు కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి వెళ్లాయని.. అందులో ఒకటి పసికందును నోట కరుచుకుని బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యిందని వివరించారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి..అంత్యక్రియలు పూర్తి చేశామన్నారు. ఘటనపై కేసు నమోదు 
చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.