అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని..ఆరేండ్ల బిడ్డను చంపిన తల్లి.. మేడ్చల్ జిల్లాలో ఘటన

అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని..ఆరేండ్ల బిడ్డను చంపిన తల్లి.. మేడ్చల్ జిల్లాలో ఘటన
  • వాటర్ ట్యాంక్​లోకి తోసి.. పైకప్పు బిగించింది
  • ప్రమాదవశాత్తు పడినట్టు చిత్రీకరించే ప్రయత్నం
  • ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అక్క
  • మేడ్చల్ జిల్లా అల్వాల్‌‌‌‌లో దారుణం

అల్వాల్, వెలుగు: అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందేమోనని భావించి.. ఆరేండ్ల బిడ్డను ఓ కన్నతల్లి వాటర్ ట్యాంక్​లో తోసి దారుణంగా హతమార్చింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన చోటుచేసుకున్నది. అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లోని వజ్ర ఎన్​క్లేవ్​లో నివాసముంటున్న రేఖ కుమార్తె తన్వీక (6) ఒకటో తరగతి చదువుతోంది.

భర్తకు విడాకులు ఇచ్చిన రేఖ.. గత కొంతకాలంగా వేరే వ్యక్తితో ఉంటోంది. ఈ క్రమంలో తన అక్రమ సంబంధానికి కూతురు అడ్డు రాకూడదని భావించి.. ఆమెను వదిలించుకోవాలని పథకం పన్నింది. ఈ నెల 16న రూ.5 తీసుకుని బయటకు వెళ్లిన తన్వీక కనిపించడం లేదంటూ రేఖ అందరినీ నమ్మించింది. బంధువులు, స్థానికులు వెతకగా కొద్దిసేపటికి బిల్డింగ్ పైన ఉన్న వాటర్ ట్యాంక్​లో తన్వీక శవమై కనిపించింది.

ప్రమాదవశాత్తు ట్యాంక్‌‌‌‌లో పడి చనిపోయినట్లు రేఖ చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో రేఖ అక్క శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అల్వాల్ పోలీసులు.. రేఖ పథకం ప్రకారం కూతురిని ట్యాంక్‌‌‌‌లో తోసి, పైకప్పు బిగించి చంపేసినట్లు తేల్చారు. నిందితురాలు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు ఆమెను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.