టీఎంసీ గ్రామపంచాయతీ సభ్యుడి కాల్చివేత.. గ్రామంలో ఉద్రిక్తత

టీఎంసీ గ్రామపంచాయతీ సభ్యుడి కాల్చివేత.. గ్రామంలో ఉద్రిక్తత

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన TMC పంచాయతీ సభ్యుడిని గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపడం తీవ్ర ఉద్రికత్తతకు దారి తీసింది. అతనికి సహాయంగా వెళ్లిన వ్యక్తిపై కూడా కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. రాజకీయ కక్షల కారణంగానే హత్య జరిగిందా లేదా వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

శుక్రవారం (జులై 28న) అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా.. మగ్రహత్ ఈస్ట్ గ్రామపంచాయతీ సభ్యుడు మైమూర్ ఘరామిని కాల్చి చంపారు దుండగులు. ఘరామీకి తోడుగా ఉన్న షాజహాన్ మొల్లా పరుగెత్తుతుండగా అతడిపైనా కాల్పులు జరిపారు. ముందుగా ఇద్దరిని మాగ్రాహత్ గ్రామీణ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మైమూర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత షాజహాన్ ను డైమండ్ హార్బర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. 

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు అంచెల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.