మగవాళ్లకూ జాతీయ కమిషన్ పెట్టాలె.. సుప్రీంకోర్టులో పిల్

మగవాళ్లకూ జాతీయ కమిషన్ పెట్టాలె.. సుప్రీంకోర్టులో పిల్

మగవాళ్లకూ జాతీయ కమిషన్ పెట్టాలె

సుప్రీంకోర్టులో పిల్.. జులై 3న విచారించనున్న కోర్టు  

న్యూఢిల్లీ : పెండ్లి అయిన మగవాళ్లు కూడా గృహహింసకు గురవుతూ, కుటుంబసమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారు తమ గోడును చెప్పుకుని న్యాయం పొందేందుకు వీలుగా ‘నేషనల్ కమిషన్ ఫర్ మెన్’ను ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. లాయర్ మహేశ్ కుమార్ తివారీ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జులై 3న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌‌సీఆర్‌‌బీ)–2021 రిపోర్టును కూడా ఈ పిల్ కు మహేశ్ కుమార్ జత చేశారు. ఈ డేటా ప్రకారం.. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

వీరిలో 1,18,979(72 శాతం) మంది పురుషులు కాగా..45,026(27 శాతం) మంది మహిళలు ఉన్నారని తెలిపారు. అందులో 81,063 మంది పెండ్లి అయిన పురుషులు కాగా.. 28,680 మంది వివాహిత మహిళలని వివరించారు. రిపోర్ట్ లోని డేటా ప్రకారం 2021లో 33.2 శాతం మంది పురుషులు కుటుంబ సమస్యల కారణంగా.. 4.8 శాతం మంది పురుషులు వివాహ సంబంధిత సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని పిటిషన్‌‌లో ప్రస్తావించారు.

వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు.. గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌‌ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌‌ను సోమవారం విచారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన బెంచ్ నిర్ణయిస్తూ షెడ్యూల్ చేసింది.