- మూసీ ప్రాజెక్టు భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ
- ప్లకార్డులతో వచ్చి అభ్యంతరం తెలిపిన ప్రజలు
గండిపేట, వెలుగు: మూసీ సుందరీకరణ, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు భూసేకరణపై గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని కిస్మత్పూర్, అత్తాపూర్సర్కిల్లోని హైదర్‌గూడలో నిర్వహించగా భూములు కోల్పోయే అవకాశం ఉన్నవారు ప్లకార్డులతో వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల ఆర్డీవో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘2013 భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ జారీ చేశాం. అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా సమర్పించండి. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. భూములు కోల్పోయే వారికి న్యాయమైన పరిహారం ఇప్పిస్తాం.
సైట్‌కు వెళ్లి నిర్మాణాల పరిమాణం పరిశీలించి, వ్యవసాయ భూమి, లేఅవుట్ భూమి వేరుగా పరిగణించి పరిహారం నిర్ణయిస్తాం’ అని చెప్పారు. అయితే, దీనికి రైతులు, భూమి యజమానులు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఎకరాకు రూ.150 కోట్లకు భూములు అమ్ముతోందని, కోకాపేట్లో ఎకరాకు రూ.177 కోట్లు, బుద్వేల్‌లో స్క్వేర్ యార్డుకు రూ.50 వేలు అమ్ముతున్నారని, తమకు మాత్రం 2013 చట్టం ప్రకారం తక్కువ పరిహారం ఎలా ఇస్తారని నిలదీశారు.
మార్కెట్ రేటు ప్రకారం లేదా భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే సర్వే నంబర్‌పై ఆరు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, భూమి పోతే అందరూ రోడ్డున పడతామని ఆవేదన చెందారు. వంద ఏండ్లుగా సాగు చేస్తున్న భూములు ఇవ్వాలని అడుగుతారా అని మండి పడ్డారు. మూసీ తమకు 500 మీటర్ల దూరంలో ఉందని, ఇండ్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో లేవన్నారు.
ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించారు. కొందరు బలవంతంగా తీసుకుంటే సూసైడ్ చేసుకునేందుకు సిద్ధమని హెచ్చరించారు. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి అధికారులు వెనుదిరిగారు. కిస్మత్పూర్, హైదర్‌గూడ వాసులతో పాటు బీఆర్‌ఎస్‌నేత కార్తీక్‌రెడ్డి, స్థానిక బీజేపీ లీడర్లు పాల్గొన్నారు.
