నేతలకు సవాల్ విసురుతున్న వరుస ఎన్నికలు

నేతలకు సవాల్ విసురుతున్న వరుస ఎన్నికలు
  • మినిస్టర్లకు బిగ్​టాస్క్​!
  • వరుసగా ఎమ్మెల్సీ, బైపోల్​, బల్దియా ఫైట్​
  • ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదలతో టీఆర్​ఎస్​
  • ఇటు సిట్టింగులపై వ్యతిరేకత.. అటు బీజేపీ దూకుడు
  • రూలింగ్​పార్టీకి టఫ్​ ఫైట్ తప్పకపోవచ్చు

వరంగల్‍ రూరల్‍, వెలుగు: ఉమ్మడి వరంగల్‍, నల్గొండ, ఖమ్మం.. ఈ  మూడు జిల్లాల పరిధిలో జరగబోయే ఎలక్షన్లు అక్కడి మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు సవాల్​గా మారనున్నాయి. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత జరగబోతున్న ఎమ్మెల్సీ, బల్దియా, సాగర్ ​బై ఎలక్షన్స్​​లో ఎలాగైనా గెలిచి తీరాని టీఆర్​ఎస్​ హైకమాండ్ పట్టుదలగా ఉంది. దీంతో గెలుపు బాధ్యతలను మినిస్టర్లు, ఎమ్మెల్యేలపై పెట్టింది. కానీ సిట్టింగులపై ప్రజల్లో వ్యతిరేకత, రోజురోజుకూ బీజేపీ బలోపేతమవుతుండడంతో రూలింగ్​ పార్టీ లీడర్లకు టార్గెట్​ టఫ్​గా కనిపిస్తోంది.

ఒక్కో జిల్లాలో రెండు ఎలక్షన్లు..

ఉమ్మడి వరంగల్‍, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో మార్చి 14న గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ ఎలక్షన్స్​ జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తుండగా, ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికలు కంప్లీట్​ కాగానే  గ్రేటర్‍ వరంగల్‍, ఖమ్మం లీడర్ల ముందు మున్సిపల్‍ కార్పొరేషన్‍ ఎలక్షన్స్​ రెడీగా ఉంటాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్‍ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణంతో ఇక్కడ బై ఎలక్షన్ ​జరగాల్సి ఉంది. మొత్తంగా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో  రెండేసి ఎలక్షన్ల చొప్పున అక్కడి రూలింగ్ పార్టీ లీడర్లకు సవాల్​ విసురుతున్నాయి. ముఖ్యంగా  టీఆర్​ఎస్​ హైకమాండ్ ఆదేశాలతో​గెలుపు బాధ్యతలను తమ భుజాన వేసుకొని నిన్నమొన్నటి దాక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హల్​చల్​ చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍, పువ్వాడ అజయ్​, జగదీశ్వర్‍రెడ్డి ఇప్పుడు ప్రచారంలో బిజీగా మారారు. ఆయా ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లను వెంటేసుకొని జోరుగా
తిరుగుతున్నారు.

సిట్టింగ్​ ఎమ్మెల్సీ దక్కేనా?

మార్చి 14న గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.  క్యాండిడేట్లు నామినేషన్లు వేస్తున్నారు. టీఆర్‍ఎస్‍ పార్టీకి ఇది సిట్టింగ్‍ సీటు. అదే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‍రెడ్డి బరిలో ఉండగా.. బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డి, కాంగ్రెస్‍ నుంచి రాములు నాయక్‍తో పాటు ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల నుంచి కోదండరామ్​, తీన్మార్​మల్లన్న(నవీన్), రాణి రుద్రమరెడ్డి, చెరుకు సుధాకర్​తదితరులు ఢీ అంటున్నారు. సిట్టింగ్​ఎమ్మెల్సీ పల్లాపై గ్రాడ్యుయేట్లలో వ్యతిరేకత ఎక్కువ ఉందనే ప్రచారం మొదటి నుంచీ ఉంది. ఏ ఒక్కరోజూ నిరుద్యోగుల సమస్యపై స్పందించలేదనే విమర్శలున్నాయి. ఇదే విషయాన్ని మిగిలిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్లలోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇదీగాక ప్రారంభంలోనే పల్లా అభ్యర్థిత్వంపై సొంతపార్టీలోనే లుకలుకలు బయటపడ్డాయి. దీంతో కేటీఆర్‍ అందరిని కూర్చోబెట్టి సముదాయించారు. మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లతో మీటింగ్‍ పెట్టి అందరికీ గెలుపు బాధ్యతలు అప్పజెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఫలితంలో తేడా రావొద్దని హుకుం జారీ చేశారు.

దుబ్బాక సీన్‍ రిపీట్‍ కావద్దని..

నాగార్జునసాగర్‍ టీఆర్​ఎస్‍ పార్టీకి సిట్టింగ్‍ సీటు. ఇక్కడ నోముల నరసింహయ్య మృతి చెందినట్లుగానే గతంలో దుబ్బాకలోనూ సిట్టింగ్‍ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. అనంతరం జరిగే ఎన్నికల్లో ఈజీగా గెలుస్తామని టీఆర్​ఎస్​ హైకమాండ్‍ భావించింది. కానీ అనూహ్య రీతిలో బీజేపీ క్యాండిడేట్‍ రఘునందన్‍రావు విజయం సాధించి గులాబీ పెద్దలకు బిగ్‍ షాక్‍ ఇచ్చారు. దీంతో, రాబోయే నాగార్జునసాగర్‍ బై ఎలక్షన్​లో దుబ్బాక సీన్‍ ఎట్టిపరిస్థితుల్లో రీపిట్‍ కావొద్దని కేసీఆర్‍ ఆర్డర్‍ వేశారు. తానే స్వయంగా సభ పెట్టి ముందస్తు ప్రచారం చేశారు. కాంగ్రెస్‍ నుంచి సీనియర్‍ లీడర్‍ జానారెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నారు. బీజేపీ సైతం ఇక్కడ విజయం సాధించాలనే ధీమాతో స్ట్రాంగ్‍ క్యాండిడేట్‍ కోసం పావులు కదుపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‍రెడ్డి ఇతరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ జోష్‍.. మంత్రులకు హెడెక్‍

రాష్ట్రంలో ఏ ఎలక్షన్‍ వచ్చినా బీజేపీ సై అంటే సై అంటోంది. పెద్ద లీడర్లతో రెగ్యూలర్‍ ప్రొగ్రాంలు పెడుతూ కేడర్​లో జోష్‍ నింపుతోంది. యూత్‍ సైతం గులాబీని వదిలి కమలం వైపు చూసేలా చేస్తోంది. కాగా, ఈ మూడు టఫ్‍ ఎన్నికలు జరిగేచోట అధికార పార్టీలో.. వరంగల్​లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍, ఖమ్మంలో పువ్వాడ అజయ్‍, నల్గొండలో జగదీశ్​రెడ్డిపై హైకమాండ్​ గెలుపు భారం పెట్టింది. వీరికితోడుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అప్పజెప్పింది. తెలంగాణ వచ్చాక జరిగిన వివిధ ఎలక్షన్లలో బంపర్​మెజారిటీలపై ఫోకస్​ పెట్టి, విజయవిహారం చేస్తూ వచ్చిన రూలింగ్​పార్టీ, ఫస్ట్​టైం ‘గెలిస్తే చాలు’ అన్నట్టుగా టఫ్​ఫైట్​కు రెడీ అవుతోందని పొలిటికల్​ అనలిస్టులు చెబుతున్నారు.

జీహెచ్‍ఎంసీ రిజల్ట్స్​తో కలవరం..

ప్రత్యేక రాష్ట్రంలో గ్రేటర్‍ హైదరాబాద్‍ను గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో డెవలప్‍ చేశామని సీఎం, మంత్రి కేటీఆర్‍ ఎన్నోసార్లు చెప్పారు. తీరా ఎలక్షన్​లో ఓటర్లు మాత్రం టీఆర్​ఎస్​కు తీవ్ర నిరాశ మిగిల్చారు. గతంలో 99 స్థానాలు ఉన్న ఆ పార్టీ ఈసారి 56 సీట్లతో సరిపెట్టుకోగా, అప్పట్లో కేవలం నాలుగు సీట్లు ఉన్న బీజేపీ అనూహ్యరీతిలో పుంజుకొని 48 సీట్లు గెలుచుకుంది. టీఆర్‍ఎస్‍ ఆవిర్భావం తర్వాత దీనినే అతి పెద్ద ఓటమిగా ఆ పార్టీ హైకమాండ్‍ భావించింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రేటర్‍ వరంగల్‍, ఖమ్మం కార్పొరేషన్‍ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ గెలిచితీరాలని నిర్ణయించింది. డిసెంబర్‍లో జరగాల్సిన ఎలక్షన్లను పోస్ట్​పోన్​ చేసి, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో హైదరాబాద్​లో మీటింగ్‍ పెట్టింది. సిట్టింగులపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు పెండింగ్‍లో ఉన్న స్మార్ట్​సిటీ ఫండ్స్​, ఇతర నిధులను రిలీజ్‍ చేసింది. దీంతో ఎమ్మెల్సీ కోడ్​కంటే ముందు రూలింగ్​ పార్టీ లీడర్లు హడావిడి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హల్​చల్​ చేయడం విమర్శలకు దారితీసింది. ఇన్నాళ్లూ కనిపించని కార్పొరేటర్లు ఎలక్షన్లు రావడంతో వచ్చారని చాలాచోట్ల పబ్లిక్​ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి

బెల్లంపల్లిలో మరో ల్యాండ్​ స్కామ్

2 వేల కోట్లతో సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతలు

వెల్లుల్లి క్యాప్సూల్స్ తయారీ యోచనలో ఉద్యాన శాఖ

ఐదు ఆప్షన్స్​, నాలుగు బబుల్స్​..NMMS ఎగ్జామ్‌లో బ్లండర్