ఐనవోలు ట్రస్ట్ బోర్డు నియామకంపై సర్కారుకు షాక్​

ఐనవోలు ట్రస్ట్ బోర్డు నియామకంపై సర్కారుకు షాక్​
  • ఎంపిక చెల్లదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 

హనుమకొండ, ఐనవోలు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గురువారం అధికారికంగా జరగాల్సిన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని రద్దు చేశారు. ఐలోని మల్లన్న జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా..10వ తేదీనే ఆలయ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఎండోమెంట్ కమిషనర్​ ఉత్తర్వులిచ్చారు. అయితే ట్రస్ట్​బోర్డు ఏర్పాటులో ఎండోమెంట్ యాక్ట్ రూల్స్​పాటించలేదని హనుమకొండకు చెందిన పైలా శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించారు. బోర్డు ఏర్పాటులో తెలంగాణ ఎండో మెంట్ యాక్ట్​ 30/1987 నిబంధనలు పాటించలేదని హైకోర్టు న్యాయవాది శ్రీరాఘవరావు వాదించారు. రూల్స్​ప్రకారం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్​ఇచ్చిన తర్వాత ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. అనంతరం దరఖాస్తుదారుల్లో అర్హులను ఎంపిక చేసి ఎండోమెంట్​ఆఫీసర్లు ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులను ఫైనల్​చేస్తూ కమిషనర్​నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడాలి. కానీ, ఇదంతా జరగకుండానే ట్రస్ట్ బోర్డును ప్రతిపాదించి, కమిషనర్​నుంచి ట్రస్ట్​ బోర్డు ఏర్పాటుకు ఆర్డర్స్​ఇప్పించారని ఆయన వాదనలు వినిపించారు. దీంతో ట్రస్ట్ బోర్డును సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. బుధవారమే ఆర్డర్స్​ఇష్యూ చేసినా.. ఆలస్యంగా తెలిసింది. 

అసలేం జరిగింది..?

ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి పాలకవర్గం గడువు గత ఏడాదే ముగిసింది. కానీ, గత జాతర సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా పాత సభ్యులతోనే టెంపరరీ కమిటీ వేసి పూర్తి చేశారు. అప్పటినుంచి మళ్లీ పాలకవర్గాన్ని నియమించలేదు. ఈ ఏడాది జాతర గడువు దగ్గర పడడంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, స్థానికుడైన డీసీసీబీ చైర్మన్​మార్నేని రవీందర్​ రావు కలిసి పాలకవర్గ ఏర్పాటుపై కసరత్తు చేశారు. ఐనవోలు మండలం  ఒంటిమామిడిపల్లికి  చెందిన బీఆర్ఎస్ నేత, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మజ్జిగ జయపాల్ కు ఆలయంలో పదవి ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇటీవల ట్రస్ట్ బోర్డు సభ్యులను ఎంపిక చేసి ప్రపోజల్స్​పంపించారు. దీంతో ఎండోమెంట్​కమిషనర్​ఈనెల10న ట్రస్ట్​ బోర్డు మెంబర్స్​ను ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నిజానికి ఆలయంలో వాటాదారులకు ట్రస్ట్​ సభ్యులుగా అవకాశం ఇవ్వకూడదని ఎండోమెంట్ యాక్ట్  చెబుతోంది. కానీ, ఆ రూల్స్​ను తుంగలో తొక్కి వాటాదారుడైన జయపాల్ పేరును తెరమీదకు తెచ్చారనే ఆరోపణలున్నాయి. ట్రస్ట్ బోర్డు మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్​ విడుదలం చేయడంతో పాటు విస్తృత ప్రచారం చేసి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఎండోమెంట్ డిపార్ట్​మెంట్​కు చెందిన ఓ ఆఫీసర్​ చెప్పారు. తర్వాత ఎండోమెంట్ అధికారులే సభ్యులను ఎంపిక చేయాల్సి ఉండగా.. నియోజకవర్గ నేతల ప్రభావంతో కొన్నేండ్లుగా ఇదంతా ఏం జరగడం లేదు. నిబంధనలేమీ పాటించకపోవడంతోనే  హనుమకొండకు చెందిన శ్రీనివాసులు కోర్టును ఆశ్రయించారు. దీంతో బోర్డు నియామకం చెల్లదంటూ కోర్టు తీర్పు చెప్పింది.  

మల్లన్నను దర్శించుకున్న సభ్యులు

అంతా సవ్యంగా సాగితే గురువారం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరగాల్సి ఉండగా.. ట్రస్ట్ బోర్డును సస్పెండ్ చేసినట్లు ఎండోమెంట్ అధికారులకు సమాచారం అందడంతో  కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో స్థానిక నేతలు కూడా నిరుత్సాహపడ్డారు. ట్రస్టీలుగా ఎంపికైన 14 మంది సభ్యులు, డీసీసీబీ చైర్మన్​మార్నేని రవీందర్​రావు, ఆయన భార్య, ఎంపీపీ మధుమతి ఆధ్వర్యంలో గురువారం మల్లన్నను దర్శించుకున్నారు. వీరిని డీసీసీబీ చైర్మన్​దంపతులు సన్మానించారు. దీంతో ఇదే ట్రస్టీతో అనధికారికంగా కమిటీ కొనసాగించి, జాతర నిర్వహించనున్నారనే ప్రచారం జోరందుకుంది. 

ఆఫీసర్లపైనే భారమంతా 

ఉదయం ధ్వజారోహణంతో జాతర మొదలు కానుండగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16 కనుమ రోజుల్లో కలిపి సుమారు10 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. పాలకవర్గం లేకపోవడంతో ఈసారి జాతర మొత్తం అధికారులే నిర్వహించాల్సి వచ్చింది. ఈ మేరకు ఎండోమెంట్ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు, అసిస్టెంట్ కమిషనర్ సునీత గురువారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఎం.వీరస్వామిని చీఫ్ ఆఫీసర్ గా నియమించారు. ఇప్పటికే ఆలయంలో చాలా సమస్యలున్నాయి. ఆలయ ఆవరణలోని వాటర్ ప్లాంట్ పని చేయక భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే టాయిలెట్స్ కూడా సరిపడా లేవు. దీంతో జాతర ఎలా జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు.