సీఎం పదవి నాకొద్దు.. సిక్కు నేతకే ఇవ్వండి

సీఎం పదవి నాకొద్దు.. సిక్కు నేతకే ఇవ్వండి

న్యూఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపింది. దీంతో తదుపరి సీఎం ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని స్పందించారు. పంజాబ్‌కు సిక్కు నేతే సీఎం అవ్వాలని ఆమె స్పష్టం చేశారు. పంజాబ్‌తో తనకు లోతైన అనుబంధం ఉందని, ఆ రాష్ట్రానికి సిక్కు లీడర్ ముఖ్యమంత్రి అవ్వడమే సరైనదని సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో జరిగిన మీటింగ్‌లో అంబికా సోని చెప్పారని తెలిసింది. 

సీఎం కుర్చీ రేసులో ఉన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ విషయంలో తాను అంత సంతృప్తిగా లేనట్లు అధిష్టానంతో భేటీలో అంబికా చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని పక్కనబెడితే.. అంబికా సోనీకి అధిష్టానం సీఎం పదవిని ఆఫర్ చేసిందని, కానీ ఆమె సున్నితంగా తిరస్కరించారని నేషనల్ మీడియా సమాచారం. ఇకపోతే, సిద్ధూతోపాటు పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, సుఖీందర్ సింగ్ రన్‌ధావా, పార్టీ నేతలు త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, బ్రహ్మ మోహింద్రా, విజయేందర్ సింగ్లా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రా కూడా సీఎం రేసులో ఉన్నారని సమాచారం.