ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికకు ప్రత్యేక యాప్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికకు ప్రత్యేక యాప్
  • నిరంతర పర్యవేక్షణ.. నోడల్ ఏజెన్సీగా ప్రణాళిక శాఖ
  • గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 5 దశల్లో అమలు
  • ఈ నెల 6న మంత్రుల సన్నాహక భేటీలు
  • పల్లె నుంచి పట్నం దాకా 99 రోజులు కార్యక్రమాలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన –- ప్రగతి ప్రణాళిక’ కింద చేపట్టే పనుల్లో ఎక్కడా అలసత్వం లేకుండా టెక్నాలజీని వినియోగిస్తున్నది. 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమ లును పర్యవేక్షించేందుకు ఒక ‘ప్రత్యేక మొబైల్ యాప్’ను అందుబాటులోకి తీసుకురానున్నది. దీని ద్వారా కార్యక్రమ పురోగతిని ఉన్నతాధికారులు రోజూ సమీక్షిస్తారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పేరుకుపోయిన పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్.. పల్లె నుంచి పట్నం దాకా పరిసరాల పరిశుభ్రత.. డ్రగ్స్ మహమ్మారికి అడ్డుకట్ట వేయడం లాంటి కార్యక్రమాలను ‘ప్రజా పాలన-–ప్రగతి ప్రణాళిక’లో ప్రభుత్వం ప్రధానంగా చేర్చింది.

పరిపాలనను మరింత పారదర్శకంగా  ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు 10  కీలక అంశాలతో కార్యాచరణ సిద్ధంచేస్తున్నది. ఈ నెల 6 న ప్రారంభమై జూన్ 12 వరకు  రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామ సభ మొదలుకుని.. రాష్ట్ర స్థాయి వరకు 5 దశల్లో ఈ  కార్యక్రమం కొనసాగుతుంది. ఈ మొత్తం కార్యక్రమానికి ‘రాష్ట్ర ప్రణాళిక శాఖ’ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్నది.  

ఈ నెల 6న  ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల భేటీలు
99 రోజుల ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 6న ఉమ్మడి జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఈ వ్యవధిలో ఆయా శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాలు  చేపట్టనున్నారు.

5 దశలు ఇవే..
* జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అనుసంధానం చేస్తూ 5 దశలకు ప్రణాళికను రూపొందించారు.

10 సూత్రాలు.. సమగ్రాభివృద్ధికి మార్గాలు
ప్రభుత్వ శాఖల సమన్వయంతో మొత్తం 10 కీలక అంశాల ప్రాతిపదికగా ఈ 99 రోజుల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ అంశాలు ఇవే..

* పరిపాలన-పరిశుభ్రత: ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ల సత్వర క్లియరెన్స్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత 
* ఆరోగ్యం: ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు 
* అరైవ్.. అలైవ్: రహదారి భద్రత, సురక్షిత ప్రయాణంపై విస్తృత అవగాహన 
* సంక్షేమం: అర్హులకు పథకాలు అందేలా చూడటం
* పిల్లల భద్రత.. డ్రగ్స్‌కు చెక్: బాలల రక్షణపై ప్రత్యేక దృష్టి.. డ్రగ్స్​కు సంపూర్ణంగా అడ్డుకట్ట వేయడం 
* రైతు సంక్షేమం: వ్యవసాయ రంగానికి ఊతం, రైతుల సంక్షేమానికి భరోసా 
*  విద్య: విద్యా ప్రమాణాల పెంపు, స్కూళ్లల్లో మౌలిక వసతుల కల్పన
* యువత-క్రీడలు: యువతకు ఉపాధి మార్గాలు, క్రీడా రంగానికి ప్రోత్సాహం 
*  మహిళలు: మహిళా సాధికారత, రక్షణ.
* పర్యావరణం: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు

ఏప్రిల్ 2 (మొదటి దశ):

గ్రామస్థాయిలో గ్రామ సభల నిర్వహణ 
 

ఏప్రిల్ 16 (రెండో దశ): 

మండల స్థాయిలో కార్యక్రమాలు
 

మే 2 (మూడో దశ):

నియోజకవర్గస్థాయిలో కార్యక్రమాలు 
 

మే 22 (నాలుగో దశ): 

జిల్లాస్థాయిలో విస్తృత కార్యక్రమాలు 
 

జూన్ 2 (ఐదో దశ):

రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ వేడుకలు