లేఆఫ్ కష్టాలు : వెయ్యి కంపెనీలకు అప్లై చేస్తే.. ఒక్కరూ జాబ్ ఇవ్వలేదు..

లేఆఫ్ కష్టాలు : వెయ్యి కంపెనీలకు అప్లై చేస్తే.. ఒక్కరూ జాబ్ ఇవ్వలేదు..

సాఫ్ట్​ వేర్​ ఇంజినీర్ల కష్టం మామూలుగా లేదు. ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని  పరిస్థితులు ప్రస్తుతం టెక్​ ఇండస్ట్రీలో నెలకొన్నాయి.  బడా కంపెనీలు సైతం నిర్దాక్షిణ్యంగా టెక్కీలను తొలగిస్తున్నాయి. జాబ్​పోయి కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్న బాధితులు సోషల్​మీడియా వేదికగా తమ బాధలు షేర్​ చేసుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ లో పని చేసిన ఒక ఉద్యోగికి ఇటీవలే కంపెనీ పింక్​స్లిప్​ఇచ్చింది.

అప్పటినుంచి ఆయన లింక్డిన్​ద్వారా వేర్వేరు కంపెనీల్లో సుమారు 1000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ తనకు ఎదురైన అనుభవంతో షాక్ తిన్నాడు.  వెయ్యికి పైగా దరఖాస్తులు పంపినా ఒక్కరంటే ఒక్కరి నుంచి కూడా ఉద్యోగ ఆఫర్లు  రావట్లేదని సోషల్​మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. అర్ధాంతరంగా ఉద్యోగం తీసేయడం వల్ల తన కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాడు.

టెక్ ఇండస్ట్రీలో కోతల కాలం...

అంతర్జాతీయంగా ఉన్న మాంద్యం కారణంతో టెక్​ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు వర్క్​ఫ్రం హోం ఆఫర్​ చేస్తుండగా, మరి కొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి.  సాఫ్ట్​వేర్​లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కోతల కాలం నడుస్తోంది.  ఇప్పటికే గూగుల్​, అమెజాన్​, మైక్రోసాఫ్ట్, ట్విటర్​లాంటి పెద్ద కంపెనీలతో పాటు పలు చిన్న కంపెనీలు సైతం ఇదే బాటలో నడుస్తున్నాయి.  

ఉద్యోగం కోల్పోయిన వారు రోజు రోజుకీ పెరుగుతుండటంతో మార్కెట్​లో పోటీ విపరీతంగా ఉంటోంది. మే 2023 వరకు దాదాపు రెండు లక్షల మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయారు. మాంద్యం ప్రభావంతోనే ఇదంతా అని చెబుతున్న ఎకనమిస్ట్​లు ఈ ఏడాది చివరి వరకు ఐటీ మార్కెట్​ కోలుకోవడం కష్టమేనని స్పష్టం చేస్తున్నారు.