నిషేధిత పురుగుల మందు అమ్ముతున్న వ్యాపారి అరెస్ట్

నిషేధిత పురుగుల మందు అమ్ముతున్న వ్యాపారి అరెస్ట్
  • రూ. 20 లక్షల విలువైన 1,160 లీటర్ల బాటిల్స్ స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు : నిషేధిత పురుగుల మందు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్న వ్యాపారితో పాటు అతడికి సహకరించిన డిస్ట్రిబ్యూటర్, డ్రైవర్ ను బాలానగర్ ఎస్ వోటీ, జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన బిల్లిపల్లి నరేందర్ రెడ్డి(35) అగారియా క్రాప్స్ సైన్సెస్ పేరుతో బయో పెస్టిసైడ్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఏపీలోని గుంటూరు జిల్లా గూడవెల్లికి చెందిన దాసరి వెంకటేశ్వరరావు(52) పురుగుల మందు డిస్ట్రిబ్యూటర్​గా పనిచేస్తున్నాడు. 

నరేందర్ రెడ్డికి పురుగుల మందుపై మంచి అవగాహన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన మోనోక్రోటోఫాస్, గ్లైపోసెట్ కు మంచి డిమాండ్ ఉందని అతడు గుర్తించాడు. ఈజీ మనీ కోసం వాటిని అమ్మేందుకు ప్లాన్ చేశాడు. గుజరాత్ నుంచి మోనోక్రోటోపాస్, గ్లైపోసెట్ ను కొనుగోలు చేసి వాటిని కంటెయినర్లలో సిటీకి తెచ్చేవాడు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ వెంకటేశ్వరరావు సాయంతో వాటికి నకిలీ లేబుల్స్ అతికించి రైతులకు అమ్మేవాడు. మంగళవారం సాయంత్రం నరేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, డ్రైవర్ కురకుల రాజు(26) మినీ ట్రక్కులో నకిలీ పురుగుల మందు డబ్బాలను నింపారు. 

వాటిని మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియాలోని రైతులకు  అమ్మేందుకు అబ్దుల్లాపూర్​ మెట్ నుంచి బయలుదేరారు. దీని గురించి సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ వోటీ, జీడిమెట్ల పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆ మినీ ట్రక్కును అడ్డుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.20 లక్షల విలువైన 1,160 బాటిళ్ల పురుగుల మందు, మినీ ట్రక్కు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.