హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నో ఏండ్లుగా అన్యాయానికి గురవుతున్న గ్రామీణ క్రికెటర్లకు చేయూతను అందించేందుకు ది తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) ఏర్పాటు చేసినట్టు ఆ సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. హెచ్‌సీఏ కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమై జిల్లాలను పట్టించుకోవడం లేదన్నారు. జంట నగరాల్లోని క్లబ్స్ కోసమే పని చేస్తున్న హెచ్‌సీఏ పెద్దలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులపై చిన్న చూపు చూస్తున్నారని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన టీడీసీఏ ఆవిర్భావ కార్యక్రమంలో విమర్శించారు.
‘ప్రతిభావంతులైన గ్రామీణ క్రికెటర్లకు అవకాశాలు రావడం లేదు. వారికి న్యాయం చేసేందుకు, జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు టీడీసీఏ ఓ వేదికగా నిలుస్తుంది. మా సంఘానికి త్వరలోనే బీసీసీఐ గుర్తింపు సాధించుకుంటాం’ అని వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఇందుకు తమవంతు సహకారం అందిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ కేవీ రమణాచారి తెలిపారు.