ఉత్తరప్రదేశ్: పిల్లలను ఎత్తుకుపోయేదనే అభియోగంతో ఓ మహిళను దారుణంగా హింసించారు ఆ ఊరి ప్రజలు. ఆ మహిళను చెట్టుకు కట్టేసి కొడుతూ అంతటితో ఆగకుండా ఈ దృశ్యాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టారు. ఈ సంఘటన గోండా జిల్లా రహెలీ గ్రామంలో జరిగింది. ఆ వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు ఈ ఘటన కారణమైన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రహెలీ గ్రామ సరిహాద్దులోని పొలం పనులు చేసుకొనే గ్రామానికి చెందిన మహిళను ఓ అజ్ఞాత స్త్రీ స్కూళ్లకు సెలవులు ఎప్పటినుంచి అనే విషయం గురించి అడిగింది. ఆమె ప్రవర్తన విచిత్రంగా అనిపించడంతో ఆమె గ్రామానికి వచ్చి ఆ ఊరి వారికి ఆ అజ్ఞాత స్త్రీ గురించి తెలిపింది.
విషయం విన్న గ్రామ ప్రజలు ఆమెను పట్టుకొని ప్రశ్నించగా.. ఆమె సరైన సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో తమ అనుమానం నిజమేననుకున్న గ్రామస్తులు ఆ మహిళను పిల్లలను ఎత్తుకుపోయేదానిలా భావించి ఆమెను చెట్టు కట్టేసి కొట్టారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. విషయం తెలుసుకున్న నవాబ్ గంజ్ పీఎస్ పోలీసులు ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకొని.. ఈ ఘటనపై ఎంక్వయిరీ చేసి ఆమెపై దాడి చేసిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
మహిళకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె గురించి విచారణ చేయగా.. ఆమె మామయ్య పీఎస్ దగ్గరలోని షాపూర్ లో ఉంటాడని తెలిసింది. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని అతను చెప్పడంతో ఆ మహిళను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఈ ఘటనకు కారణమైన 9 మందిపై కేసు నమోదు చేశారు.
