కొడుకు అనారోగ్యంతో కుంగిపోయిన ఫ్యామిలీ.. లండన్‌లో బిల్డింగ్ పైనుంచి దూకి మృతి

కొడుకు అనారోగ్యంతో కుంగిపోయిన ఫ్యామిలీ.. లండన్‌లో బిల్డింగ్ పైనుంచి దూకి మృతి

లండన్ నగరంలో ఒక ఇండియన్ ఫ్యామిలీ 36వ అంతస్తు నుంచి దూకి మరణించటం అందరి గుండెలను పిండేస్తోంది. మే 27న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ముంబైకి చెందిన రాకేష్ పాయ్ (47), అదితి పరాల్కర్ (46) దంపతులతో పాటు వారి 9 ఏళ్ల కుమారుడు సిడ్ కూడా మరణించారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డను కాపాడుకోలేక, తీవ్ర మానసిక వేదనతో ఆ తల్లిదండ్రులు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఆ దంపతులిద్దరూ ముంబై నుంటి లండన్‌కు వలస వెళ్లి.. అక్కడ ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా, కన్స్ట్రక్షన్ రంగంలో సీనియర్ హోదాల్లో స్థిరపడి సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను నిర్మించుకున్నారు. అయితే వారి కుమారుడు సిడ్ పుట్టుకతోనే అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో జన్మించాడు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉండేవాడు. ఆ పిల్లోడికి ప్రత్యేక సంరక్షణ అందించడం కోసం తల్లి అదితి తన ఉద్యోగంతో పాటు హోమ్ స్కూలింగ్ ద్వారా బాధ్యతలను మోసింది. యూకేలో వారికి ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడంతో.. ఆ ఒంటరితనం, బిడ్డ అనారోగ్యం ఆమె మానసిక స్థితిని తీవ్రంగా దెబ్బతీశాయి.

తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఈ దంపతులు 6 ఏళ్ల క్రితం తిరిగి ముంబైకి కూడా వచ్చారు. అక్కడ కూడా వైద్యులు చేతులెత్తేయడంతో, తిరిగి యూకే వెళ్లిపోయారు. ఇటీవల లండన్ వైద్యులు కూడా సిడ్ వ్యాధికి ఇక ఎలాంటి చికిత్సా మార్గాలు లేవని, అతడు కోలుకోవడం అసాధ్యమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. కళ్లెదుటే ప్రాణాంతక వ్యాధితో నలిగిపోతున్న బిడ్డను చూస్తూ భరించలేక, ఇక ఏ దారీ లేక ఆ తల్లిదండ్రులు ఈ భయంకరమైన నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

అయితే సన్నిహితులు మాత్రం ఇది ఆత్మహత్య కాకపోవచ్చని అంటున్నారు. స్థానిక లేబర్ ఎంపీ నీల్ కోయ్లే కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. "ఇది ఒక భయంకరమైన విషాదం. బిడ్డ అనారోగ్య సమస్యలే ఆ తల్లిదండ్రులను ఈ తీవ్ర నిర్ణయానికి పురికొల్పి ఉండవచ్చు" అని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బ్రిటీష్ పోలీసులు ఈ మరణాలను అనూహ్యమైనవిగా పరిగణిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతలు మితిమీరి, మానసిక ఒత్తిడి ఎక్కువైతే ఎంతటి చదువుకున్న వారైనా విషాదకర ముగింపు వైపు వెళ్తారనే దానికి ఈ ఘటన ఒక కన్నీటి సాక్ష్యంగా నిలిచింది.