
ఆచి తూచి సినిమాలు చేసే సుధీర్‌బాబు.. బాగా ఆలోచించి కానీ ఓ సినిమా తీయని ఇంద్రగంటి మోహనకృష్ణల కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. మూడో ప్రయత్నంగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ తెరకెక్కింది. మెలోడియస్ సాంగ్స్, ఇంటరెస్టింగ్ టీజర్లూ ట్రైలర్లతో టీమ్ అంచనాలు పెంచుకుంటూ వెళ్లింది. మరి సినిమా ఎలా ఉంది? థియేటర్స్ లో ఆ అమ్మాయి గురించి ఏం చెప్పారు? ఎలా చెప్పారు? ఓసారి చూద్దాం.
కథేమిటంటే..
నవీన్ (సుధీర్) ఓ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్. వరుస హిట్లు కొడుతూ ఉంటాడు. సడెన్‌గా అతని చేతికి ఓ అమ్మాయి షోరీల్ దొరుకుతుంది. అంతే.. ఇంప్రెస్ అయిపోతాడు. తననే హీరోయిన్గా పెట్టి ఓ మాంచి లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో తెలీదు. దాంతో వెతకడం మొదలుపెడతాడు. ఎట్టకేలకి ఆమె వివరాలు పడతాడు. తను అలేఖ్య (కృతి). ఒక డాక్టర్. యాక్టర్ అయ్యే ఉద్దేశం లేదంటూ హీరో ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. కానీ ఎలాగో ఆమెని కన్విన్స్ చేసి సినిమా స్టార్ట్ చేస్తాడు నవీన్. పని చేసే క్రమంలో ఆమెతో ప్రేమలోనూ పడతాడు. అంతలో తెలిసిన అలేఖ్య ఫ్యామిలీ ఆమెను బలవంతంగా తీసుకుపోతారు. సినిమాల్లో నటించడానికి వీల్లేదంటూ రిస్ట్రిక్ట్ చేస్తారు. అప్పుడు నవీన్ ఏం చేశాడు, అసలు వాళ్లకి సినిమాలంటే ఎందుకు ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ల మనసులు మార్చి నవీన్ అనుకున్నది చేయగలిగాడా లేదా అనేది తెరమీద చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సుధీర్, మోహనకృష్ణ కాంబినేషన్ అనగానే గుర్తొచ్చేది ‘సమ్మోహనం’ సినిమా. అదితీరావ్ హైదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా కూడా ఫిల్మ్ మేకింగ్ చుట్టూనే తిరుగుతుంది. మధ్యలో లవ్‌స్టోరీ ఉంటుంది. అది ఎంత అందంగా ఉంటుందంటే.. కమర్షియల్‌గా హిట్టు కాకపోయినా క్లాసిక్ అనే పేరు తెచ్చుకుంది. మళ్లీ మూవీ మేకింగ్ బ్యాక్‌డ్రాప్‌నే ఈ హీరో, దర్శకుడు ఎంచుకున్నారు. మళ్లీ అలాంటి సినిమానే తీశారా అనే డౌట్స్ ని ట్రైలర్‌తో రెయిజ్ చేశారు. అది నిజం కాదు. ఎందుకంటే ఈ రెండు సినిమాలకీ అంతగా పోలిక లేదు. కారణం.. అందులో ఉన్నంత ఫీల్ ఇందులో లేదు.
ఒక అందమైన ప్రేమకథకి ఏం ఉండాలి? రెండు బలమైన పాత్రలు. వాటి మధ్య అందమైన భావోద్వేగాలు. వాటిని కలిగించే చక్కని సిట్యుయేషన్లు. ఇవన్నీ ఉండబట్టే సమ్మోహనం చూసి మెస్మరైజ్ అయిపోయారు ప్రేక్షకులు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటానికి కారణం అదే. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో తడబడ్డారు. సినిమాలో చక్కని పాయింట్ ఉంది. దాన్ని సీక్రెట్‌గా దాచిపెట్టి కథను అల్లుకుంటూ వెళ్లారు. దాంతో అదేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మొదట్లో ఏర్పడుతుంది. అయితే కథ నడిచిన విధానం ఆ ఆసక్తిని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ పోతుంది. కథ చాలా భారమైనది కావడం.. కథనం అంతకంటే భారంగా సాగడం.. ఎక్కడా కామెడీ కూడా లేకపోవడం రిలీఫ్ దొరక్కపోవడం వంటివి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. ఫస్టాఫ్ అంతా దాదాపు ఇలాగే సాగిపోతుంది. ఇంటర్వెల్ కూడా సోసోగానే ఉంటుంది. హీరోయిన్ పాత్ర విషయంలో ఇచ్చిన ట్విస్టు ఇంటరెస్టింగ్‌గానే అనిపించినా.. ఆ తర్వాత సినిమా మరీ సీరియస్‌గా మారిపోవడంతో సెకెండాఫ్ మీద పెట్టుకున్న కాస్తో కూస్తో ఆశలు కూడా కరిగి నీరవుతాయి.
ఎమోషన్ సినిమాకి అవసరమే. కానీ కూరలో ఉప్పు ఎక్కువ, తక్కువైతే తినడానికి ఎలా పనికి రాదో.. సినిమాలో ఎమోషన్ ఎక్కువో తక్కువో అయినా కూడా అలానే ఉంటుంది. ఈ సినిమాలో దాని స్థాయి మించిపోవడం పెద్ద మైనస్ అయ్యింది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీనే సరిగ్గా కుదరకపోవడంతో వాళ్ల మధ్య రిలేషన్ మనల్ని ఎక్సయిట్ చేయదు. ఇక ఫ్లాష్‌బ్యాక్ అయితే గుదిబండలా అనిపిస్తుంది. హీరోయిన్ ఫ్యామిలీ సీన్లు సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంటాయి. ఇంత చూపించడం అవసరమా అనే ఫీల్‌ని కలిగిస్తాయి. ఎలాగో వాటన్నింటినీ దాటుకుని క్లైమాక్స్ వరకు చేరుకున్నా.. అక్కడా పెద్ద అద్భుతాలేమీ జరగవు. సోసోగా సాగి ఇక చూసింది చాలు వెళ్లమంటూ బై చెప్పి పంపేస్తాయి. మొత్తంగా శ్రుతి మించిన ట్రాజెడీ.. భరించలేనంత భారమైన ఎమోషన్లు.. కొత్తదనం లేని క్యారెక్టర్లతో ఇంద్రగంటి మార్క్ కనిపించకుండా సాగిందీ సినిమా.
ప్లస్సులూ మైనస్సులూ
ఈ సినిమాకి మొదటి ప్లస్ సుధీర్ బాబు. కొంతకాలంగా తన నటనను అంతకంతకూ మెరుగు చేసుకుంటూ, నటుడిగా చాలా మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాడు సుధీర్. ఈ సినిమాలో తన టాలెంట్‌ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ అదరగొట్టాడు. అయితే పాత్ర అంత చెప్పుకోదగ్గది కాదు. అదే కాస్త వెర్సటాలిటీతో మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే.. అతని మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లేవాడు. కృతికి ఈసారి కూడా పెద్దగా మార్కులు పడవు. ఆమె నటన కృతకంగా ఉంటోంది అనే కామెంట్‌ని మరోసారి బలపర్చింది. గత చిత్రాల కంటే కాస్త పర్వాలేదేమో కానీ.. అంత ఎమోషనల్ క్యారెక్టర్ ఆమెకి ఇవ్వాల్సింది కాదు అనిపిస్తుంది చూసిన వాళ్లెవరికైనా. వెన్నెల కిశోర్ కాసిన్ని నవ్వులు పంచాడు. రాహుల్ రామకృష్ణ అంతంత మాత్రంగా అనిపించాడు. మిగతావాళ్లంతా ఓకే.
ఇక టెక్నికల్ విషయాలు..
లవ్‌స్టోరీస్ అనేగానే ముందుగా మ్యూజిక్ మీదే అందరి దృష్టీ పడుతుంది. అందులోనూ వివేక్ సాగర్ చేశాడు కనుక మంచి ఫీల్ ఉన్న సంగీతాన్ని ఆశిస్తారంతా. అయితే ఈసారి ఆశించిన స్థాయిలో ఇవ్వలేకపోయాడేమో అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఒకట్రెండు పాటలు చాలా బాగున్నాయి. మిగతావి కూడా అదే స్థాయిలో ఉంటే మంచి ఆల్బమ్ అయ్యుండేది. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదని ప్రతి ఫేమ్‌లో అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అయితే కథ, కథనాల విషయంలో ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుందేది. చెప్పాలంటే స్టోరీకి స్కోప్ ఉంది. స్క్రీన్ ప్లే దాన్ని తగ్గించేసింది. ఇంద్రగంటి నేరేషన్‌కి ఓ ప్రత్యేకత ఉంది. చిన్న చిన్న సన్నివేశాలను సైతం ఎంతో అందంగా తీర్చిదిద్దగలడు తను. కానీ ఈసారి ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్.
కొసమెరుపు: ఆ అమ్మాయి అంతంత మాత్రమే!
నటీనటులు: సుధీర్‌బాబు, కృతీశెట్టి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాణం: మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి
దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ