వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను గురువారం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులు సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మామునూర్ ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ, అభివృద్ధి పనులపై చర్చిస్తూ రన్‌వే స్థితి, టెర్మినల్ సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి వల్ల ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో ఏఏఐ అధికారులు ఎం.రాజా కిషోర్, రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సౌత్ రీజియన్) అచింత కుమార్ దత్తా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ జి.నటరాజు, ఏజీఎం(ఇంజినీరింగ్–సివిల్), ల్యాండ్ మేనేజ్‌మెంట్ అధికారులు, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సుమ, సర్వే ల్యాండ్ ఏడీ శ్రీనివాస్, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

