కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆప్ ​నిరాహార దీక్ష

కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆప్ ​నిరాహార దీక్ష

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు ఆదివారం ఇక్కడి జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. పెద్ద సంఖ్యలో పార్టీ వాలంటీర్లు, మద్దతుదారులు ఈ దీక్షలో పాల్గొన్నారు. కటకటాల వెనుక కేజ్రీవాల్ ఉన్న పోస్టర్లు చూపుతూ దేశభక్తి గీతాలు ఆలపించారు. లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇటీవల విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘కేసును ఎంక్వైరీ చేస్తున్న సీబీఐ, ఈడీ వద్ద మొత్తం 456 మంది సాక్షులలో నలుగురు మాత్రమే కేజ్రీవాల్ పేరు ప్రస్తావించారు. ఆ నలుగురు కూడా ఏ పరిస్థితుల్లో కేజ్రీవాల్‌‌‌‌ పేరు చెప్పారో ప్రజలకు తెలుసు’’ అని అన్నారు.

బీజేపీ నియంతృత్వ పాలనకు సాగిస్తోందని ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్టుపై ప్రజలు కోపంగా ఉన్నారనీ.. ఇది బీజేపీని శవపేటికలోకి పంపిస్తుందని మండిపడ్డారు. పంజాబ్‌‌‌‌లో భగత్ సింగ్ పుట్టిన ఊరు ఖట్కర్ కలాన్ వద్ద చేపట్టిన దీక్షలో ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్, మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు వాషింగ్టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీ ఎదుట, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, బోస్టన్‌‌‌‌ సిటీ హార్వర్డ్ స్క్వేర్, లాస్ ఏంజెల్స్ లోని హాలీవుడ్ సైన్, కెనడాలోని టొరంటో, లండన్, ఆస్ట్రేలియాలోని మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో ఆప్ మద్దతుదారులు నిరసనలు నిర్వహించారు.