
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్(50)ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. తెల్లవారుజామున ఢిల్లీలోని ఓఖ్లాలో ఖాన్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు.. 6 గంటలకు సోదాలు చేశారు. ఆ సమయంలో ఖాన్‌ను పలు ప్రశ్నలు అడగగా.. ఆయన జవాబు చెప్పలేదు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను నేరుగా ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఖాన్ ఇంటి ముందు ఆప్ కార్యకర్తలు, స్థానికులు భారీగా గుమిగూడారు.
అంతకుముందు ఖాన్ మాట్లాడుతూ.. తనను అరెస్టు చేయడానికే ఈడీ అధికారులు తన ఇంటికి చేరుకున్నారని అన్నారు. తన అత్తగారికి ఇటీవలే సర్జరీ జరిగిందని, ఆమెను చూసుకోవాల్సి ఉందని చెప్పినా అధికారులు వినలేదని ఆయన పేర్కొన్నారు. అనంతరం అధికారులు ఖాన్‌ను కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. కోర్టు ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించింది. కాగా.. ఖాన్‌పై అంతకుముందు రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేయగా.. అక్రమంగా ఆస్తులను సంపాదించారన్న ఆరోపణలపై ఢిల్లీ ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాన్‌కు పది సమన్లు జారీ చేశామని, ఏ ఒక్కదానికీ ఆయన స్పందించలేదని ఈడీ అధికారులు తెలిపారు. లా ఎగ్జామ్స్ ఉన్నాయని, తన అత్తకు బాగా లేదని ఏదో ఒక కారణం చెబుతూ ఆయన తప్పించుకున్నారని, చివరకు అరెస్టు చేయక తప్పలేదని వెల్లడించారు.
ఎంత తొక్కాలని చూస్తే.. అంతగా గొంతెత్తుతం
అమానతుల్లా ఖాన్ అరెస్టుపై ఆప్ నేతలు స్పందించారు. తమ నేతలను అరెస్టు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నదని, తమను ఎంతగా తొక్కాలని చూస్తే అంతగా గొంతెత్తుతామన్నారు. సాక్ష్యాధారాలు లేకుండానే ఖాన్‌ను అరెస్టు చేశారని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. ‘‘నియంతృత్వానికీ విప్లవకారులు ఎన్నడూ తలవంచరు.
తప్పుడు కేసులో మా ఎమ్మెల్యేను బీజేపీకి చెందిన ఈడీ కస్టడీలోకి తీసుకుంది. వారు (బీజేపీ) చేసిన పనికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు” అని సంజయ్ ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండకూడదన్న ఉద్దేశంతోనే వారిని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపుతున్నదని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.